Scam: అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి కేసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును ఈడీ బయటపెట్టింది. భారత్‌లో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అమెరికా పౌరుల నుంచి కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించింది.
అమెరికా పౌరులకు ఫోన్ చేసి వారి బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని, కంప్యూటర్లలో వైరస్ ఉందని తొలుత భయపెట్టేవారు. ఆ తర్వాత అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), న్యాయశాఖ అధికారులమంటూ పరిచయం చేసుకునేవారు. డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుల్లో మీ పేరు ఉందని, అరెస్ట్ కాకూడదంటే వెంటనే డబ్బులు చెల్లించాలని బెదిరించేవారు. నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డులు, కోర్టు పత్రాలు కూడా చూపించేవారు. దాదాపు 20 లక్షల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఈ మోసానికి ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది.
25
డయలర్లు, బ్యాంకర్లు, క్లోజర్లు.. పక్కా ప్లాన్
ఈ ముఠా కార్పొరేట్ సంస్థ తరహాలో కార్యకలాపాలు నిర్వహించింది. సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.
డయలర్లు: బాధితులకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరించేవారు.
బ్యాంకర్లు: వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించేవారు.
క్లోజర్లు: ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
బాధితుల నుంచి నగదు, బంగారం, గిఫ్ట్ కార్డులు, బ్యాంకు బదిలీల రూపంలో డబ్బులు తీసుకునేవారు. పటియాలాలో రెండు, పుణెలో ఒకటి.. మొత్తం మూడు నకిలీ కాల్ సెంటర్లను ఈడీ గుర్తించింది.
35
రూ.261 కోట్లు.. క్రిప్టో, హవాలా ద్వారా బదిలీ
వసూలు చేసిన డబ్బును అమెరికాలోని మ్యూల్ బ్యాంకు ఖాతాలు, దుబాయ్, హాంకాంగ్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్, హవాలా మార్గాల్లో భారత్‌కు తరలించినట్లు గుర్తించారు. 2025 జూలై నుంచి 2026 సెప్టెంబర్ వరకు 927 లావాదేవీల ద్వారా 27.39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.261 కోట్లు) వసూలు చేసినట్లు తేలింది. ఇప్పటివరకు 549 మంది అమెరికా పౌరులను బాధితులుగా గుర్తించారు.
మంచు విష్ణు, కాజల్ నటించిన 'మోసగాళ్లు' సినిమా గుర్తొస్తోందా?
ఈ ఘటన 2021లో విడుదలైన మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటించిన 'మోసగాళ్లు' సినిమాను గుర్తు చేస్తోంది. ఆ సినిమాలోనూ హైదరాబాద్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమెరికా పౌరులను మోసం చేస్తారు. అమెరికా పన్నుల శాఖ (IRS) అధికారులమంటూ ఫోన్ చేసి పన్ను ఎగవేత ఆరోపణలతో బాధితులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఈ మోసాన్ని పోలీసులు ఎలా ఛేదించారన్నదే సినిమా కథ. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈడీ కేసులోనూ దాదాపు ఇదే తరహా మోసం జరగడం గమనార్హం.
55
ఏడుగురు అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు నిందితులు
ఈ కేసులో నవంబర్ 3న హర్షిల్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పిథాడియాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మరో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో మొత్తం నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. నిందితులను హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? మోసం చేసిన డబ్బుతో ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు? అనే కోణాల్లో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.