Conductor Pravalika: చిల్లర విషయంలో ప్రయాణికురాలితో తలెత్తిన వివాదం ఓ మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలను బలిగొంది. ఆసుపత్రిలో కొన్నిరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద అక్టోబర్ 25న ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక (24) విధుల్లో ఉండగా చిల్లర విషయంలో ఓ ప్రయాణికురాలితో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆ ప్రయాణికురాలు ప్రవళికను బస్సు నుంచి కిందకు నెట్టివేసింది. దీంతో ఆమె అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
24
హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స.. ఫలించని వైద్యుల ప్రయత్నాలు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కొత్తపేటలోని సాయి సంజీవిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రవళిక కోలుకుని తిరిగి విధుల్లో చేరుతారని కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు ఆశించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
34
నిందితురాలిపై హత్య కేసు నమోదు చేయాలి
ప్రవళిక మరణవార్తతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి జరగడం, దాని కారణంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యురాలైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై. నాగిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీని కోరారు. ప్రవళిక కుటుంబానికి సంస్థ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె మరణం టీజీఎస్ ఆర్టీసీకి తీరని లోటని పేర్కొంటూ సంతాపం తెలిపారు.
కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల డిమాండ్
ప్రవళిక మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరాయి. ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబ భవిష్యత్తుకు అవసరమైన సహకారం కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు నిరసనగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బుధవారం మణుగూరు డిపో బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు ఉద్యోగులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రవళిక మృతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రతతో పాటు సిబ్బంది రక్షణకు ప్రాధాన్యమిస్తూ టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై బస్సు డోర్లు పూర్తిగా మూసుకున్న తర్వాతే వాహనాన్ని ముందుకు కదిలించాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశించింది. బస్సుల తలుపులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు సూచించింది. ఈ నిబంధనలు కేవలం ఆర్టీసీ సొంత బస్సులకే పరిమితం కాకుండా సంస్థ పరిధిలో నడుస్తున్న అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. తలుపుల పనితీరు, ప్రయాణికుల భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని యాజమాన్యం ఆదేశించింది.