IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం

Published : Aug 27, 2026, 08:06 PM IST

Rain Alert: బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

PREV
15
బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు

ప్రస్తుతం తెలంగాణపై రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది అమృత్‌సర్‌, అంబాలా, ముజఫర్‌నగర్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం, రాంచీ, దిఘా మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ–రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా దక్షిణ తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ పరిసరాలకు కదిలింది. ఈ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఏర్పడింది.

25
రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు సూచించారు.

35
హైదరాబాద్‌లోనూ వానలు

ఉత్తర, తూర్పు జిల్లాలతో పోలిస్తే పశ్చిమ తెలంగాణలో వర్ష తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూడా పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో ఒక్కసారిగా వర్షం కురిసే పరిస్థితులు ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

45
ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం గురువారం, శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

55
అధికారులు కీలక సూచనలు

వర్షం, ఈదురుగాలులు ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణ అధికారులు సూచించారు. ముఖ్యంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, భారీ హోర్డింగ్‌లకు సమీపంలో ఉండొద్దని హెచ్చరించారు. ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద వాహనాలను నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్‌ తీగలు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులను చేపట్టాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories