Hyderabad: అడవుల్లో రాత్రుళ్లు ప్రయాణిస్తూ, జంతువులను ప్రత్యక్షంగా చూస్తుంటే కలిగే ఆ అనుభూతే వేరని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ అవకాశం ఇప్పుడు హైదరాబాదీలకు కూడా లభించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఓ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. భారత కేంద్ర జూ అథారిటీ (Central Zoo Authority of India - CZAI) గతంలో విధించిన నైట్ సఫారీపై నిషేధాన్ని తొలగించడంతో, హైదరాబాద్ జూలో రాత్రి సఫారీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాదిలోగా ఇది సందర్శకుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
25
రాత్రిపూట సఫారీ ఎలా ఉంటుంది.?
ఈ నైట్ సఫారీ సేవలు రాత్రి 6:00 గంటల నుంచి రాత్రి 11:00 వరకు కొనసాగుతాయి. సందర్శకులు రాత్రిపూట చురుకుగా తిరిగే జంతువులను చూడొచ్చు. సాధారణంగా వీటిని పగటి వేళల్లో గమనించటం కష్టం. ఇందులో నిశాచర జంతువులు, రాత్రి జీవన విధానాన్ని పాటించే జాతులు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ప్రత్యేక లైటింగ్, సైలెంట్ వాహనాల ద్వారా వీక్షకులకు మరిచిపోలేని అనుభూతి లభిస్తుంది.
35
నెహ్రూ జూ పార్క్ ఎక్కడుంది.?
నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ బహదూర్‌పురా ప్రాంతంలో, మిర్ ఆలం ట్యాంక్ పక్కన విస్తరించి ఉంది. దీనిని 1963 అక్టోబర్ 6న అధికారికంగా ప్రారంభించారు. నిర్మాణం 1959 అక్టోబర్ 26న మొదలై నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ పార్క్‌కు పక్కనే ఉన్న మిర్ ఆలం ట్యాంక్‌కి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది.
నెహ్రూ జూ పార్క్‌లో సుమారు 2,240కు పైగా జంతువులు నివసిస్తున్నాయి. వీటిలో 55 జాతులకుచెందిన క్షీరదాలు 664, 97 జాతులకు చెందిన 1227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు, 2 జాతులకు చెందిన 8 ఉభయచర జీవులు వంటివి ఉన్నాయి. ఇవేకాకుండా ఈ జూలో ఉండే సహజ వాతావరణం కారణంగా రకరకాల పక్షులు సైతం వస్తుంటాయి.
55
నైట్ సఫారీలో సరికొత్త అనుభూతులు
రాత్రిపూట జీవించే జంతువులను ప్రత్యక్షంగా గమనించడం అనేది సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ సఫారీ ద్వారా పిల్లలు, జంతుప్రేమికులు, ప్రకృతిని ఆస్వాదించేవారికి కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. జంతువుల సహజ ప్రవర్తనను రాత్రిపూట వీక్షించగలిగితే, వాటి జీవనశైలిపై అవగాహన పెరుగుతుంది. నైట్ సఫారీ కారణంగా సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.