
School Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు స్కూల్ విద్యార్థులకు పట్టరాని ఆనందం. ఎప్పుడూ వచ్చే ఆదివారం సెలవుకోసమే ఎదురుచూస్తుంటారు... అలాంటిది వారం మధ్యలో ఏదైనా పండక్కో, పర్వదినానికో సెలవు వచ్చిందంటే చాలు ఎగిరిగంతేస్తారు. ఇక భారీ వర్షాలు, బంద్ ల కారణంగా సడన్ హాలిడేస్ వచ్చాయో మురిసిపోతారు.
అయితే ఈ సెలవులన్ని ఒకేసారి కలిసివస్తే... తెలంగాణ విద్యార్థులకు ఈ వీకెండ్ లో ఇలాగే వరుస సెలవులు వస్తున్నాయి. వీకెండ్ కు బోనాల పండగ, విద్యార్థి సంఘాల బంద్ కలిసి రావడంతో నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తెలంగాణ విద్యార్థులకు వరుసగా ఐదురోజుల సెలవులు కూడా పొందవచ్చు.
హైదరాబాద్ లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో వీరి పిల్లలు ఎక్కువగా ఉండే విద్యాసంస్థలు శనివారం సెలవు ఇస్తుంటాయి. ఇలాంటి విద్యార్థులకు ఇంకా రెండ్రోజులే స్కూళ్లు నడిచేది... జులై 19న సెలవు వస్తుంది.
ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సాధారణంగా సెలవు ఉంటుంది. ఇక ఈ ఆదివారం తెలంగాణోళ్లకు మరీముఖ్యంగా హైదరబాదీలకు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం ఆషాడమాసం బోనాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే... ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు పూర్తయ్యాయి. ఈ ఆదివారం హైదరబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈరోజు తెలంగాణలో విద్యాసంస్ధలకు ఎలాగూ సెలవే కాబట్టి పండక్కి ప్రత్యేకంగా సెలవు ప్రకటించాల్సిన అవసరం లేకుండాపోయింది.
ఆదివారం హైదరాబాద్ ఆడపడుచులు బోనమెత్తి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మేకలు, కోళ్లను బలిచ్చి కుటుంబసభ్యులంతా విందు చేసుకుంటారు. ఇక పురుషులు అమ్మవారికి కల్లు సాకపోసి వారుకూడా తాగుతారు... కొందరు బంధువులు, స్నేహితులతో మందుపార్టీ చేసుకుంటారు. ఇలా ఆదివారమంతా విందు, మందు, ఊరేగింపులతో సందడి నెలకొంటుంది.
సోమవారం కూడా ఈ బోనాల సందడి కొనసాగుతుంది... అలాగే ఆదివారం వేడుకల్లో పాల్గొని ప్రజలు అలసిపోయివుంటారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ సోమవారం అంటే జులై 21న తెలంగాణవ్యాప్తంగా అధికారికంగానే సెలవు ప్రకటించింది. అంటే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సెలవు వర్తిస్తుంది.
వరుసగా మూడ్రోజుల సెలవుల తర్వాత మంగళవారం తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే ఈ ఒక్కరోజు మేనేజ్ చేసారంటే మరో సెలవు కలిసివస్తుంది. అంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు విద్యార్థులు సెలవు పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే వరుసగా ఐదురోజులు సెలవులు కలిసివస్తాయి.
తెలంగాణలో విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. జులై 23 (మంగళవారం) తెలంగాణలోని స్కూళ్ళు, కాలేజీలు స్వచ్చందంగా బంద్ పాటించాలని ఏఐఎస్ఎఫ్ (All India Students Federation) కోరుతోంది. ప్రైవేట్ విద్యాసంస్ధల అధికంగా వసూలుచేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఖచ్చితంగా మూడ్రోజులు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి... కొందరికి మాత్రం నాలుగురోజుల సెలవులు వస్తాయి. అయితే విద్యార్థులు మధ్యలో ఒకరోజు లీవ్ తీసుకుంటే వరుసగా ఐదురోజులు సెలవులే.
గమనిక : విద్యార్థులు సెలవు తీసుకోవాలని చెప్పడం మా ఉద్దేశం కాదు... అవసరం అనుకుంటే తీసుకోవచ్చు.