అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Sep 03, 2026, 08:02 PM IST

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు మేరకు ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించడంతో దుమారం రేగింది. ఈ క్ర‌మంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

PREV
16
సుస్మిత వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన వివాదం

కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరకు మంత్రి పదవి కోల్పోయే వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశంపై కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగింపు తర్వాత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. తనపై తీసుకున్న చర్యను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తన వివరణ తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

26
కుమార్తె వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలిని?

తనపై చర్య తీసుకోవడానికి కుమార్తె చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ప్రశ్నించారు. తన కుమార్తె స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి అని, ఆమె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను ప్రతి సందర్భంలో ఖండించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, ఈ పరిణామం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. రాజీనామా చేయాలని పార్టీ నుంచి ఎవరూ తనను కోరలేదని కూడా వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఇతర నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా ప్రశ్నించారు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉండాలని ఆమె అన్నారు.

36
బ్లాక్‌మెయిల్ రాజకీయాలంటూ ఆరోపణ

మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనను తొలగించే విషయంలో అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. తనపై చర్యలు తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. త‌న‌ను బ‌ర్త‌రాఫ్ చేయ‌క‌పోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తాన‌ని బ్లాక్ మెయిల్ చేశార‌న్న అర్థం వ‌చ్చేలా సురేఖ ఆరోపించారు. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి పదవులపై తనకు ప్రత్యేకమైన ఆసక్తి లేదని చెబుతూనే, తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు దక్కడం మాత్రం సంతోషంగా ఉందన్నారు.

46
కొండా సుస్మిత ఎంట్రీతో మరింత ముదిరిన వివాదం

ఈ రాజకీయ వివాదంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత స్పందన కూడా కీలకంగా మారింది. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత హోదాలో చేసినవేనని ఆమె స్పష్టం చేశారు. అవి ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కావని తెలిపారు. తన తల్లికి అన్యాయం జరిగిందని భావిస్తున్నానని, ఆమెకు ఎప్పుడూ అండగా నిలుస్తానని సుస్మిత చెప్పారు. తన తల్లిని రాజకీయంగా బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం ఎవరి వల్లా కాదని వ్యాఖ్యానించారు. పరకాల నియోజకవర్గం అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయ సవాల్ కూడా విసిరారు.

56
తదుపరి అడుగు ఏంటి?

మంత్రివర్గం నుంచి తొలగింపు తర్వాత కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన మద్ధతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగే అవకాశాన్ని పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా ఆమె కుటుంబానికి ఆహ్వానాలు ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో కొండా సురేఖ తదుపరి రాజకీయ గమ్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటి వరకు ఆమె తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వవచ్చన్న అంచనాలు ఉన్నాయి. కొండా కుటుంబం తీసుకునే నిర్ణయం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

66
సురేఖ ఔట్.. గుండు సుధారాణికి కీలక అవకాశం

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించిన పరిణామాల మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణికి కీలక పదవి దక్కడంపై కూడా రాజకీయ చర్చ జరుగుతోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నేతగా ఆమెకు ప్రాధాన్యం దక్కడం వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో పద్మశాలి సామాజిక వర్గం రాజకీయంగా ప్రభావం చూపే స్థాయిలో ఉండటంతో, ఆ వర్గంలో అసంతృప్తి రాకుండా కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో మహిళా నేతకు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గుండు సుధారాణికి రాజకీయ జీవితంలో గతంలో కూడా అనూహ్యంగా కీలక అవకాశాలు దక్కాయి. టీటీడీ బోర్డు సభ్యురాలిగా పనిచేయడం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక కావడం వరకు ఆమె రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమెకు ఇప్పుడు మరో కీలక బాధ్యత దక్కడంతో రాజకీయంగా ఆమె ప్రాధాన్యం మరింత పెరిగింది.

మొత్తంగా కొండా సురేఖ తొలగింపు కేవలం ఒక మంత్రి పదవి మార్పుకే పరిమితం కాలేదు. కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సామాజిక సమీకరణాలు, బీసీ నాయకత్వానికి ప్రాధాన్యం, కొండా కుటుంబం తదుపరి రాజకీయ ప్రయాణం వంటి అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి కొండా సురేఖ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపైనే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories