KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ

Published : Dec 21, 2025, 07:09 PM IST

KCR : మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే జనవరిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

PREV
15
కేసీఆర్ కీలక నిర్ణయాలు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గంటన్నర పాటు ప్రసంగించిన కేసీఆర్, రాష్ట్ర రాజకీయాలపై తన వ్యూహాన్ని బహిర్గతం చేశారు. ఈ సమావేశం మొత్తం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

25
జనవరిలో మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు

రాబోయే జనవరిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లో బీఆర్ఎస్‌కు ఎదురైన నష్టాన్ని తిరిగి పూడ్చుకోవడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ రూపొందించారు. మొదట మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి, ఆ తర్వాత ప్రజల సపోర్టును సమీకరించేలా బహిరంగ సభలు ఉంటాయని వివరించారు.

35
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది అంటూ ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గర్వంతో వ్యవహరిస్తోందని, రెండేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆరోపించారు. పార్టీ గుర్తు లేకుండా జరిగిన స్థానిక ఎన్నికల్లోనే కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

45
జలవనరుల అంశంలో పోరాటానికి కేసీఆర్ పిలుపు

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లాల వారీగా సమావేశాలు, నిరసనలు నిర్వహించి రైతులను చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాయ్ భాయ్ రాజకీయాలతో తెలంగాణకు నష్టం జరుగుతోందని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని చంద్రబాబు చేసిందేమీ లేదని సెటైర్లు వేశారు.

55
బీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంపై దృష్టి

ఈ సమావేశంలో బీఆర్ఎస్ ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల యాక్టివ్ చర్యలను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని, అప్పుడు అసలు బలాబలాలు తేలుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్, వచ్చే నెలల్లో చేపట్టనున్న సభలు, ఉద్యమాలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories