Hyderabad: అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కాగా దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు బీజం పడుతోంది. హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఒక కీలక దశలోకి అడుగుపెట్టింది.
ఈ బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి అందించింది. 778 కిలోమీటర్ల పొడవుతో రూపొందిస్తున్న ఈ హైస్పీడ్ మార్గం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ లైన్ రెండు మహానగరాల మధ్య ప్రయాణాన్నిపూర్తిగా మార్చేయనుంది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు మాత్రమే కాకుండా ప్రయాణ భారాన్ని భారీగా తగ్గించనుంది.
25
కొత్త మార్గానికి కీలక అప్‌డేట్
మొదట గూడూరు మార్గంతో ప్రణాళిక చేసిన రూట్‌ను తాజా అవసరాలను పరిశీలించి మార్చారు. తమిళనాడు అభ్యర్థన మేరకు తిరుపతి స్టేషన్‌ను కొత్త అలైన్‌మెంట్‌లో చేర్చారు. ఇది రెండు నగరాల మధ్య ధార్మిక, వ్యాపార, పర్యాటక ప్రయాణానికి పెద్దగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాధారణంగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ ఈ హైస్పీడ్ ట్రాక్ పూర్తి అయితే కేవలం 2 గంటల్లో తిరుపతికి చేరుకునే అవకాశం లభించనుంది.
35
చెన్నైలో రెండు ప్రధాన స్టేషన్లు
తమిళనాడు పరిధిలో రెండు స్టేషన్లను నిర్మించనున్నారు. వీటిలో ఒకటి చెన్నై సెంట్రల్, రెండోది మీంజూరు సమీపంలోని చెన్నై రింగ్ రోడ్. ఈ రెండు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్ చుట్టూ రవాణా–ఆధారిత వాణిజ్య హబ్‌ల కోసం దక్షిణ మధ్య రైల్వే దాదాపు 50 ఎకరాల భూమి కోరింది. ఇవి భవిష్యత్‌లో వ్యాపార కేంద్రాలుగా, లాజిస్టిక్స్ హబ్‌లుగా మారే అవకాశముంది.
హైస్పీడ్ నెట్‌వర్క్‌లో తమిళనాడులో 12 కిలోమీటర్ల భూగర్భ సొరంగం నిర్మాణం ఉంటుంది. మొత్తం కారిడార్‌కు 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ ప్రాంతం లేకపోవడం భూసేకరణను సులభతరం చేస్తుంది. ఈ మార్గం మొత్తం 65 రహదారులు, 21 హైటెన్షన్ విద్యుత్ లైన్లు దాటుతూ ముందుకు సాగుతుంది. రైట్స్ లిమిటెడ్ నిర్వహించిన సమగ్ర సర్వేల ఆధారంగా ఈ రూట్‌ను నిర్ధారించారు.
55
ఆర్థిక ప్రగతి, ఉద్యోగాలు
ఈ కారిడార్ వల్ల హైదరాబాద్–చెన్నై మధ్య వ్యాపారం మరింత వేగంగా పెరుగుతుంది. సేవా రంగం, ఇండస్ట్రీలు, పర్యాటక రంగాల్లో భారీ అవకాశాలు ఏర్పడతాయి. హైస్పీడ్ నెట్‌వర్క్ ఏర్పాటు వల్ల నిర్మాణ రంగం నుంచి ఆపరేషన్ల వరకు వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రణాళికలో ఉన్న రెండు ప్రధాన హైస్పీడ్ మార్గాలలో ఇది ఒకటి కాగా.. మరొకటి హైదరాబాద్–బెంగళూరు కారిడార్. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ, స్టేషన్ స్థలాల ఖరారుపై సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.