హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో కీలక మలుపుగా నిలిచే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నాలుగు గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాదు పరిమితి భారీగా పెరగనుంది. కొత్తగా విలీనం కానున్న ప్రాంతాల్లో పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్ వంటి వేగంగా పెరుగుతున్న పట్టణాలు ఉన్నాయి.
విలీనంతో ఈ ప్రాంతాలకు మరింతగా నిధులు, మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, మురికివాడల నివారణ, విద్యుత్ వంటి పౌర సేవలు అందే అవకాశాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.