Hyderabad: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు నేపథ్యంలో హైదరాబాద్‌లో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఆయుధాలతో కాకుండా విషంతో వేలాది మందిని సమూహిక హత్య చేసేందుకు చేసిన ఓ భారీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా మరోసారి ఉగ్ర లింకులు బయటపడటంతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మూడు మంది ఐసిస్ అనుచరులను అదుపులోకి తీసుకుంది. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన వైద్యుడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి తుపాకులు, రసాయనాలు, రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పినట్లుగా, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన ఈ ముగ్గురు దేశంలో పెద్ద స్థాయి విధ్వంసానికి పన్నాగం పన్నారు.
25
సైనైడ్ కంటే ప్రమాదకరమైన రసాయనం – రైసిన్ తయారీ
అహ్మదాబాద్ సమీపంలోని అడాలజ్ టోల్ ప్లాజా వద్ద ఏటీఎస్ అధికారులు సయ్యద్ మొహియుద్దీన్‌ను పట్టుకున్నారు. అతడి బ్యాగ్‌లోని ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న ద్రవ పదార్థాన్ని పరీక్షించగా, అది ‘రైసిన్’ అనే అత్యంత విష రసాయనమని తేలింది. ఇది సైనైడ్ కన్నా శాతం ఎక్కువగా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థం స్వల్ప పరిమాణంలోనే ప్రాణాంతకం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆముదం గింజల నుంచి మిగిలిపోయిన వ్యర్థాలతో ఈ రసాయనాన్ని తయారు చేస్తున్నాడు. ఈ పని కోసం అతడు తన నివాసంలోని గదినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఈ విషయంతో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. దేవాలయాల్లో ప్రసాదం, మంచి నీటిలో విషాన్ని కలిపి వేలాది మందిని చంపాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
35
ఒంటరి జీవితం, రహస్య ప్రయోగాలు
మొహియుద్దీన్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో తల్లిదండ్రులతో నివసించేవాడు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత, కొంతకాలం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేశాడు. పెళ్లి ఆలస్యం కావడంతో ఒత్తిడికి గురై, ఆన్‌లైన్‌లో రసాయనాలపై ప్రయోగాలు మొదలుపెట్టాడని స్థానికులు చెబుతున్నారు. తన గదిలోనే రసాయనాలు మిక్స్ చేస్తూ కొత్త పదార్థాలు తయారు చేసేవాడు. కుటుంబసభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేయగా, తాను మార్కెట్‌లో అమ్మదగిన విలువైన రసాయనం తయారు చేస్తున్నానని చెప్పేవాడట.
మొహియుద్దీన్ ఉగ్రవాదం పట్ల ఆసక్తి పెంచుకున్నాక, టెలిగ్రామ్ గ్రూపులు, సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా ఐసిస్ సానుభూతిపరులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారిచ్చిన ఆదేశాలతో కోల్‌కతా, ముంబయి, అహ్మదాబాద్ నగరాలకు తరచుగా ప్రయాణించేవాడు. గుజరాత్ డీఐజీ సునీల్ ప్రకారం – “సయ్యద్ వద్ద ఆయుధాలు, రసాయనాలు లభించాయి. ఫోన్ డేటా పరిశీలనలో అతడు విదేశీ వ్యక్తులతో క్రమం తప్పకుండా సమాచారం పంచుకున్నట్లు తేలింది. రైసిన్ అనే ప్రమాదకర పదార్థాన్ని స్వయంగా తయారు చేస్తున్నాడు” అని వివరించారు.
55
హైదరాబాద్‌లో తనిఖీలు
గుజరాత్ ఏటీఎస్ అధికారులు సమాచారం అందించిన వెంటనే, హైదరాబాద్ పోలీసులు రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంపై నిఘా ఏర్పాటు చేశారు. ఇంట్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలు ఉన్నాయనే అనుమానంతో, ఏటీఎస్ బృందం త్వరలో తనిఖీలు జరపనుంది. స్థానిక పోలీసులు కూడా అతడితో సంబంధం ఉన్న వ్యక్తులపై విచారణ ప్రారంభించారు. గతంలో కూడా రైల్వే స్టేషన్లపై ఉగ్ర కుట్రలలో హైదరాబాద్ లింకులు బయటపడిన నేపథ్యంలో, ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.