Published : Nov 11, 2025, 12:57 PM ISTUpdated : Nov 11, 2025, 01:09 PM IST
IMD Cold Wave Alert : కాశ్మీర్ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అత్యల్పంగా ఎక్కడో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు ప్రజలు మొన్నటివరకు ఇవేం వానల్రా నాయనా..! అనుకున్నారు. మరి ఇప్పుడు ఇదేం చలిరా నాయనా..! అనుకుంటున్నారు. మొంథా తుపాను బీభత్సం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత రెండుమూడు నెలలుగా వర్షాలు దంచికొడితే.. ఇప్పుడు చలి పంజా విసురుతోంది. చలికాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి... మరి డిసెంబర్, జనవరిలో పరిస్థితి ఏంటోనని తెలుగు ప్రజలు కంగారు పడుతున్నారు.
26
తెలంగాణలో సింగిల్ డిజిట్ పడిపోయిన టెంపరేచర్
తెలంగాణలో ఈ శీతాకాలంలో మొదటిసారి 10 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున 8.7 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇక ఆదిలాబాద్ లో 10, నిర్మల్ లో 11.7, సంగారెడ్డిలో 12, కామారెడ్డిలో 12, మెదక్ లో 13, సిద్దిపేటలో 13 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ఫోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డిలో 13 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమొదయ్యింది.
36
హైదరాబాద్ టెంపరేచర్
హైదరాబాద్ విషయానికి వస్తే.. అత్యల్పంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 13.4 డిగ్రీ సెల్సియస్ నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇక రాజేంద్రనగర్ లో 14.7, గచ్చిబౌలిలో 15, మారేడుపల్లిలో 15.2, గాజులరామారంలో 15.7, నేరేడ్మెట్ లో 15.9, బేగంపేటలో 16.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం ఇప్పటివరకు తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కాలేవని చెబుతోంది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 11.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు చెబుతోంది. ఇక పటాన్ చెరులో 14.2, హకీంపేటలో 18.1, దుండిగల్ లో 17.6, హన్మకొండలో 15, ఖమ్మంలో 18.6, మహబూబ్ నగర్ లో 18.1, మెదక్ లో 13, నల్గొండ19.4, నిజామాబాద్ లో 15.7, రామగుండంలో 17.6 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క భద్రాచలంలో మాత్రం 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
56
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 నుండి 11 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్నాయి. అలాగే చాలా జిల్లాల్లోనూ ఇలాగే చల్లని గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పాడేరు, అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.
66
తెలుగు ప్రజలారా జాగ్రత్త...
ఇలా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి చలిగాలులు పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే పదిరోజులు అంటే నవంబర్ 20 వరకు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని... కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి పరిస్థితి దిగజారిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ చలిగాలులతో శ్వాస సమస్యలతో బాధపడేవారితో పాటు చిన్నారులు, ముసలివారు అనారోగ్యం బారినపడే అవకాశాలుంటాయి.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.