Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే మోసం కాదా.? కొత్త చ‌ర్చ‌కు తెర తీసిన హైకోర్ట్

Published : Apr 04, 2026, 09:46 AM IST

Hyderabad: ప్రేమ, వివాహ హామీలు, విఫలమైన సంబంధాల కేసులు చాలాసార్లు కోర్టుకు చేరుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ కేసులో తెలంగాణ హైకోర్టు చేసిన కీల‌క వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. ప్రేమించి పెళ్లి చేసుకోక‌పోతే మోసం కాదా అన్న డిబెట్ మొద‌లైంది.

PREV
15
ప్రేమ విఫలమైతే అది నేరమా?

పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం చాలా సందర్భాల్లో వివాదాలకు దారి తీస్తుంది. అయితే ప్రతి సందర్భాన్ని మోసం కేసుగా పరిగణించలేమని తెలంగాణ‌ హైకోర్టు అభిప్రాయపడింది. సంబంధం కొనసాగిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల వివాహం జరగకపోతే దాన్ని క్రిమినల్ నేరంగా చూడటం సరైంది కాదని న్యాయస్థానం తెలిపింది. ప్రేమ సంబంధం విఫలమవడం ఒక వ్యక్తిగత విషయం మాత్రమేనని పేర్కొంది.

25
పెద్దపల్లి యువకుడి పిటిషన్

వివ‌రాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును జస్టిస్ ఎన్. తుకారాంజీ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని, ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, గతంలో కూడా ఇలాంటి కేసుల్లో హైకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన తీర్పులను ప్రస్తావించారు.

35
ఇంత‌కీ యువ‌తి వాద‌న ఏంటంటే.?

యువతి తరఫు న్యాయవాది మరో కోణాన్ని కోర్టు ముందు ఉంచారు. 2018లో యువకుడు ప్రేమను వ్యక్తం చేశాడని, మొదట తాను నిరాకరించానని చెప్పారు. అయితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు సంబంధం కొనసాగిందని, చివరికి పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు యువకుడు వెనక్కి తగ్గాడని వాదించారు. పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో మొదట అంగీకరించినట్లు చెప్పి తరువాత తిరస్కరించాడని, ఇది మోసమేనని యువతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

45
సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులను ప్రస్తావించారు. హృదయరంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ బిహార్ రాష్ట్రం, ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర వంటి కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఆ తీర్పుల ప్రకారం ఒక వ్యక్తి మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రేమను ప్రారంభిస్తే మాత్రమే అది మోసం కేసుగా పరిగణించవచ్చు. కానీ సంబంధం కొనసాగిన తర్వాత పరిస్థితుల కారణంగా వివాహం జరగకపోతే అది కేవలం మాట నిలబెట్టుకోలేకపోవడమే తప్ప మోసం కాదని పేర్కొన్నారు.

55
మోసం కాదని తీర్పు

ప్రస్తుత కేసులో ఇద్దరూ ఐదేళ్లపాటు ప్రేమలో కొనసాగినట్లు రికార్డుల్లో ఉందని కోర్టు గమనించింది. ఇంతకాలం సంబంధం కొనసాగిన నేపథ్యంలో మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. అందువల్ల ఈ కేసును కొనసాగించడం చట్ట ప్రక్రియను అనవసరంగా ఉపయోగించడం అవుతుందని పేర్కొన్నారు. చివరగా హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించి పిటిషనర్‌పై నమోదైన కేసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సోష‌ల్ మీడియాలో చ‌ర్చ

ఇదిలా ఉంటే ఈ అంశంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది. ఒక వ్య‌క్తి మోసం చేయాల‌నే ఉద్దేశంతో ప్రేమించ‌డం మొద‌లు పెడ‌తాడ‌న్న విష‌యం ఎలా తెలుస్తుంది అంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిల‌బెట్టుకోక‌పోవ‌డం చ‌ట్ట‌ప‌రంగా మోసం కాక‌పోయినా.. ఇది అవ‌త‌లి వ్య‌క్తి భావోద్వేగాల‌ను దెబ్బ తీయ‌డం కాదా అంటున్నారు. ఏది ఏమైనా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర లేపింద‌న‌డంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories