Hyderabad: మారిన కాలంతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. రకరకాల మార్గాలను ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త రకం మోసం జరుగుతోంది. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ చేశారు.
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని ఆకర్షణీయమైన యాడ్స్‌తో వల వేస్తున్నారు. “అమ్మాయిలతో మాట్లాడండి”, “ఫ్రెండ్షిప్ యాప్ డౌన్‌లోడ్ చేయండి” వంటి ప్రకటనలు చూసి క్లిక్ చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
25
ఫేక్ యాప్స్ – డేటా మొత్తం వారి చేతుల్లోకి
ఈ యాడ్స్ ద్వారా ఇచ్చే లింక్‌లపై క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేస్తే, మీ ఫోన్ భద్రత పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. కాంటాక్ట్స్, ఫోటోలు, వ్యక్తిగత డేటా అన్నీ హ్యాకర్లకు చేరుతాయి. పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యాప్స్ అసలు వినోదం కోసం కాదు, డేటా దోపిడీ కోసం రూపొందించినవే.
35
కాల్ ఉచ్చు
యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కాల్ ద్వారా మోసం మొదలవుతుంది. ముందుగా ఆకర్షణీయంగా కనిపించే వీడియోలు చూపిస్తారు. మీ ముఖాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. తర్వాత ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తారు. “మీ వీడియోలను మీ ఫ్రెండ్స్‌కు పంపుతాం” అంటూ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విధానాన్నే సెక్స్టార్షన్ అంటారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈ మోసపూరిత ప్రకటనలు పెరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపించే ఈ యాడ్స్ వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసి అట్రాక్ట్ కాకూడదని సూచిస్తున్నారు.
55
మోసానికి గురైతే వెంటనే ఏం చేయాలి?
ఇలాంటి వలలో చిక్కుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. అధికారిక సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించకూడదు. జాగ్రత్తగా ఉండడం ద్వారానే ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.