ట్యాంక్‌బండ్‌లోని బుద్ధుడి విగ్రహం నీటిలో ఎలా తేలుతుంది? 450 ట‌న్నుల విగ్ర‌హాన్ని ఎలా తీసుకొచ్చారు

Published : Oct 02, 2026, 07:19 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ మధ్యలో కనిపించే బుద్ధుడి విగ్రహం నగరానికి ఒక గుర్తింపు. దూరం నుంచి చూస్తే నీటిపై తేలుతున్నట్టుగా కనిపించే ఈ భారీ విగ్రహం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
బుద్ధుడి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎందుకు ఏర్పాటు చేశారు?

1980లలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చే ఒక భారీ నిర్మాణం ఉండాలని ఆలోచించారు. అమెరికా పర్యటనలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసిన తర్వాత, హైదరాబాద్‌లోనూ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు రూపం వచ్చింది. బుద్ధుడిని శాంతి, మానవతకు ప్రతీకగా భావించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1985లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ శిల్పి ఎస్.ఎం. గణపతి స్థపతి నేతృత్వంలో భారీ బుద్ధ విగ్రహం రూపుదిద్దుకుంది. సుమారు ఐదేళ్ల పాటు సాగిన పనిలో వందలాది మంది కార్మికులు, శిల్పులు పాల్గొన్నారు. చివరకు తెల్లటి గ్రానైట్‌తో రూపొందిన ఏకశిల బుద్దుడు సిద్ధమయ్యాడు.

25
విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?

ఈ బుద్ధుడి విగ్రహం కోసం హైదరాబాద్‌కు సమీపంలోని రాయగిరి–భువనగిరి ప్రాంతంలోని కొండల్లో లభించిన భారీ తెల్లటి గ్రానైట్ రాయిని ఎంపిక చేశారు. అక్కడే ఆ భారీ రాతిని చెక్కుతూ బుద్ధుడి రూపాన్ని తయారు చేశారు. అంటే విగ్రహం చిన్న చిన్న రాళ్లను కలిపి తయారు చేసినది కాదు. ఒకే భారీ రాతి నుంచి చెక్కిన ఏకశిల విగ్రహం.

విగ్రహం సుమారు 58 అడుగుల ఎత్తు, దాదాపు 350 టన్నుల బరువు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సమాచారం, ఇతర చారిత్రక రికార్డులు పేర్కొంటున్నాయి. ఇంత భారీ రాతి విగ్రహాన్ని నగరానికి తరలించడమే అప్పట్లో పెద్ద సాంకేతిక సవాలు.

35
నీటిపై ఎలా తేలుతోంది? అసలు రహస్యం ఇదే!

చాలామందికి హుస్సేన్‌సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం నీటిపై తేలుతున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం నీటిపై తేలడం లేదు. విగ్రహం కింద హుస్సేన్‌సాగర్ మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ కాంక్రీట్ ప్లాట్‌ఫామ్ ఉంది. దీనినే సాధారణంగా ‘రాక్ ఆఫ్ జిబ్రాల్టర్’ అని పిలుస్తారు. ఈ కృత్రిమ రాతిపై బుద్ధుడి విగ్రహాన్ని నిలబెట్టారు. అందుకే చుట్టూ నీరు కనిపించడంతో విగ్రహం నీటిపై తేలుతున్నట్టుగా దూరం నుంచి అనిపిస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. బుద్దుడు నీటిపై తేలడం లేదు.. నీటి మధ్యలో ఉన్న ప్రత్యేక ప్లాట్ ఫామ్ పై నిలబడి ఉన్నాడు.

45
విగ్రహాన్ని తరలించే సమయంలో ఏం జరిగింది?

ఈ బుద్ధ విగ్రహ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం ఇదే. 1990 మార్చి 10న విగ్రహాన్ని ప్రత్యేక బార్జ్‌పై ఎక్కించి హుస్సేన్‌సాగర్‌లోని ప్లాట్ ఫామ్ వద్దకు తరలించే ప్రయత్నం చేశారు. బార్జ్ సుమారు 100 గజాలు (91 మీటర్లు) ప్రయాణించిన తర్వాత అదుపు తప్పి ఒకవైపు ఒరిగింది. భారీ బుద్ధ విగ్రహం బార్జ్ నుంచి జారిపోయి హుస్సేన్‌సాగర్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. విగ్రహం సరస్సులో పడిపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అంత భారీ ఏకశిల విగ్రహాన్ని తిరిగి బయటకు తీయడం మరో భారీ సవాలుగా మారింది.

55
రెండేళ్ల తర్వాత బయటకు తీసి..

హుస్సేన్‌సాగర్ అడుగున పడిపోయిన భారీ విగ్రహాన్ని వెంటనే బయటకు తీయడం సాధ్యం కాలేదు. ప్రత్యేక పరికరాలు, ఇంజినీరింగ్ పద్ధతులతో దాదాపు రెండేళ్ల పాటు సాగిన రక్షణ చర్యల తర్వాత విగ్రహాన్ని వెలికి తీశారు. అనంతరం హుస్సేన్‌సాగర్ మధ్యలో సిద్ధం చేసిన కాంక్రీట్ ప్లాట్ ఫామ్ పై విజయవంతంగా నిలబెట్టారు. 1992 డిసెంబర్ 1న బుద్ధ విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించారు.

తర్వాత కాలంలో ఈ ప్రదేశం హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రస్తుతం బోట్‌లో వెళ్లి విగ్రహాన్ని దగ్గరగా చూడవచ్చు. హుస్సేన్‌సాగర్ మధ్యలో తెల్లటి గ్రానైట్‌తో మెరిసే ఈ భారీ బుద్ధ విగ్రహం, చుట్టూ కనిపించే నీరు, నగర నేపథ్యం కలిపి హైదరాబాద్‌కు ప్రత్యేకమైన దృశ్యాన్ని అందిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories