
హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు, డెలివరీ రైడర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో ‘అప్‌జీ హౌస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. కొండాపూర్‌లోని హైటెన్షన్ లైన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ జియాలజీ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారంలో ఏడు రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుంది.
అప్‌జీ బృందం ఆరు నెలల పాటు కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని డార్క్ స్టోర్ క్లస్టర్లలో 4,163 మంది గిగ్ వర్కర్లతో మాట్లాడి అధ్యయనం చేసింది. ఇందులో 68 శాతం మంది రోజుకు 10 గంటలకు పైగా రోడ్లపైనే పనిచేస్తున్నట్లు వెల్లడైంది. పని సమయంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో 90 శాతం మంది రోడ్డు పక్కన లేదా సౌకర్యాలు సరిగా లేని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. తాము పనిచేసే ప్లాట్‌ఫామ్‌లు సరైన వాష్‌రూమ్ సదుపాయం కల్పిస్తున్నాయని కేవలం 5 శాతం మంది మాత్రమే తెలిపారు.
స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్, రాపిడోతో పాటు అర్బన్ కంపెనీ వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం పనిచేసే వారికి కూడా అప్‌జీ హౌస్‌లో సభ్యత్వం పొందే అవకాశం ఉంది. సభ్యులకు ఏసీ సీటింగ్, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వైద్యుల సంప్రదింపులు కూడా ఉంటాయి. విశ్రాంతి సమయంలో టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ వంటి ఆటలు ఆడుకునే సదుపాయం కల్పించారు. వారానికి రూ.99 లేదా నెలకు రూ.349 సభ్యత్వ రుసుముగా నిర్ణయించారు.
మహిళా గిగ్ వర్కర్ల కోసం అప్‌జీ హౌస్‌లో ప్రత్యేక ప్రైవేట్ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన టాయిలెట్లు, సురక్షితంగా కొంత సమయం విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు లేకపోవడం వల్ల మహిళలు గిగ్ వర్క్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మహిళల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అప్‌జీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య వుచి మాట్లాడుతూ.. డెలివరీ రైడర్లను కేవలం ఒక్కో ఆర్డర్‌కు అయ్యే ఖర్చుగా కాకుండా తమ సేవల ప్రధాన కస్టమర్లుగా చూస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గిగ్ వర్కర్‌కు పని చేసే ప్రాంతానికి సమీపంలో ఇలాంటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ చట్టం–2026’ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. రోజంతా రోడ్లపై పనిచేసే గిగ్ వర్కర్లకు విశ్రాంతి, భోజనం వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించే కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి డాక్టర్ హరిచందన దాసరి, ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. అప్‌జీని ఆదిత్య వుచి, నిరంజన్ సీలం కలిసి చాషి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.