Bonalu: ఘ‌నంగా బోనాల పండుగ‌.. లాల్ దర్వాజ మహంకాళి దర్శనానికి భక్తుల తాకిడి

Published : Jul 20, 2025, 06:43 PM IST

Bonalu Celebrations: లాల్ దర్వాజ బోనాల ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్య‌లో భక్తులు బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన‌డం హైలైట్‌గా నిలిచింది.

PREV
16
ఆధ్యాత్మిక వైభవంతో లాల్ దర్వాజ బోనాలు

హైదరాబాద్‌ ప్రజలు ఆధ్యాత్మికతను చాటుతూ ఘ‌నంగా బోనాల ఉత్స‌వాలు జ‌రుపుకున్నారు. లాల్ దర్వాజలో మహంకాళి బోనాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.

ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన బోనాల పండుగ, జూలై 29 వరకు కొనసాగనుంది. గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పండుగ ఉజ్జయినీ మహంకాళి ఆలయం, తర్వాత లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో మహోత్సవంగా సాగుతోంది.

26
బోన‌మెత్తిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రత్యేక పూజలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ నేత‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోన‌మెత్తారు. హైదరాబాద్ బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. మొదట కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం, ఆమె లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.

సంప్రదాయ బోనంలో అన్నం, బెల్లం, పెరుగు పెట్టి, అమ్మవారికి అర్పించిన కవిత, రాష్ట్ర ప్రజల శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆమె ఉత్సవంలో పాల్గొనడం భక్తులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది.

36
బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన్న ప్ర‌ముఖులు.. అమ్మవారికి పట్టు వస్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

బోనాల పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లాల్ దర్వాజ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు.

46
బోనాల ఉత్సవాల్లో భాగంగా సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యత

బోనాలు తెలంగాణలో మహిళలకు ప్రత్యేక పండుగ. మహిళలు సంప్రదాయ బోనం తయారు చేసి, అమ్మవారికి సమర్పించడం ప్రత్యేకత. కల్వకుంట్ల కవిత ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం చేకూరుస్తూ లాల్ దర్వాజ అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించారు.

ఆమె పాల్గొనడం జాగృతి సభ్యుల్లోను, భక్తుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది. హరిబౌలి, సుల్తాన్ షాహీ, బేలా ప్రాంతాల్లో రంగురంగుల ఎల్ఈడీ అలంకరణలు, ఆలయ కమిటీ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఉత్సవాన్ని మరింత అందంగా మార్చాయి. లాల్ దర్వాజ మహంకాళి బోనాల ఉత్సవం సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను చాటుతూ, తెలంగాణ ప్రజల భక్తిశ్రద్ధలకు నిదర్శనంగా నిలిచింది.

56
బోనాల‌తో ఆల‌యాల వ‌ద్ద భక్తుల రద్దీ.. భారీ భద్రతా ఏర్పాట్లు

బోనాల మహోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండగా, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ వంటి విభాగాలు విధుల్లో నిమగ్నమయ్యాయి. తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు భక్తుల కోసం అందుబాటులో ఉంచారు.

66
బోనాలు : సైబరాబాద్, రాచకొండలో మద్యం దుకాణాలు మూత

బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అన్ని మద్యం షాపులు, క‌ల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 21 (సోమవారం) ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆదేశాలు తెలంగాణ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 20 ప్రకారం అమలులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న మద్యం అమ్మకాలపై తాత్కాలిక నిషేధం విధించారు. అయితే, స్టార్ హోటళ్లలోని బార్లు, క్లబ్బులు మాత్రం దీని నుంచి మినహాయింపును ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories