ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?

Published : Feb 27, 2026, 08:19 AM IST

HPV Vaccine: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ఏంటీ వ్యాక్సిన్‌? దీని ఉప‌యోగం ఏంటంటే.?  

PREV
15
14 ఏళ్ల బాలికలే లక్ష్యం

ఈ టీకా కార్యక్రమం మొదటి దశలో 14 ఏళ్ల బాలికలను లక్ష్యంగా పెట్టుకున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించేందుకు హెచ్‌పీవీ (Human Papilloma Virus) టీకా కార్యక్రమం ఈ నెల 28న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుమారు 3.45 ల‌క్ష‌ల మంది, తెలంగాణ‌లో 3.30 లక్షల మందికి టీకా పంపిణీ చేయ‌నున్నారు. ఏపీలో తొలి విడతగా 1.9 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు, తెలంగాణ‌లో 1.45 లక్షల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. బాలికల వయస్సును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారిస్తారు. 

25
గర్భాశయ క్యాన్సర్ నివారణలో కీలక టీకా

మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. హెచ్‌పీవీ వైరస్ కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ టైప్ 16, 18 వంటి ప్రమాదకర రకాలతో పాటు టైప్ 6, 11 వైరస్‌ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఈ టీకా తీసుకున్న బాలికలకు దీర్ఘకాల రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హెచ్‌పీవీ టీకాను సాధారణ టీకా కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కోట్లాది డోసులు పంపిణీ అయ్యాయి. టీకా అమలు చేసిన దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గినట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి.

35
మార్చి నుంచి మే వరకు ప్రత్యేక డ్రైవ్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్చి నుంచి మే వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో టీకాలు ఇస్తారు. బాలికలకు టీకా ఇచ్చే ముందు తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్న తర్వాతే టీకా వేస్తారు. టీకా ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. అవసరమైతే ఇంటి వద్దకు వెళ్లి టీకా ఇవ్వడం వంటి విధానాలను కూడా పరిశీలిస్తున్నారు. టీకా తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించినా వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

45
గార్డాసిల్ వ్యాక్సిన్ ఉచితంగా

ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా గార్డాసిల్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర సుమారు రూ.4 వేల వరకు ఉంటుంది. మార్కెట్‌లో 15 ఏళ్ల లోపు బాలికలకు రెండు డోసులు, 15 ఏళ్లు పైబడిన వారికి మూడు డోసులు అవసరం అవుతాయి. అయితే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సింగిల్ డోసుతోనే రక్షణ కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం స్వచ్ఛందం. తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీకా ఇవ్వరు.

55
క్యాన్సర్ భారాన్ని తగ్గించే లక్ష్యం

ప్రపంచంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఆరు లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం కీలక ఆరోగ్య చర్యగా తీసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories