భారతీయ విద్యా భవన్‌లాంటి స‌దుపాయాలతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు.. తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్స్ పేరుతో

Published : Feb 27, 2026, 07:09 AM IST

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో కార్పొరేట్ స్థాయిలో విద్య‌ను అందించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. 

PREV
15
తెలంగాణ‌లో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త తరహా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరం పరిధి బయట ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలు కలిగిన ఆదర్శ పాఠశాల నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 26న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

25
100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల్లో ఆధునిక తరగతి గదులు, విశాలమైన క్రీడా మైదానాలు, ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, రవాణా సౌకర్యం అందుబాటులో ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల పాఠశాల నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. అక్కడ ఉన్న మౌలిక వసతులు, బోధనా విధానాన్ని పరిశీలించి అదే స్థాయిలో కొత్త పాఠశాలలు నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా నిలబెట్టే విధంగా ఈ ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు.

35
క్యూర్ పరిధిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో పాఠశాలలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించాల‌ని సీఎం రేవంత్ సూచించారు. ఆధునిక నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా 12 కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏడాదిలో పూర్తి చేయాలని, 17 పాఠశాలలను అప్‌గ్రేడ్, 164 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. హైదరాబాద్‌లో ఉన్న భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్స్ తరహా సౌకర్యాలు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో ఉండాలని సూచించారు.

45
పాఠశాల విద్యలో ఏఐ, టెక్నాలజీకి ప్రాధాన్యం

మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో సాంకేతిక మార్పులు తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. కృత్రిమ మేథ (AI) ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే దాని బోధన ప్రారంభించాలని సూచించారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలలో ఏఐ ఆధారిత కోర్సులు ప్రారంభించాలని ఆదేశించారు. పాతబడిన కోర్సులను తొలగించి పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

55
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, పాలు, స్టూడెంట్ కిట్లు

2026–27 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని నిర్ణయించారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రతి విద్యార్థికి పాలు ఇవ్వాలని ఆదేశించారు. పాలను విజయా డెయిరీ నుంచి సేకరించనున్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉంటున్నాయో తెలుసుకునేందుకు టెక్నాలజీ వినియోగించాలన్నారు. ఈ సంవత్సరం నుంచే విద్యార్థులకు ప్రత్యేక స్టూడెంట్ కిట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కిట్‌లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, క‌ల‌ర్ పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, డిక్షనరీ, షూస్, సాక్సులు వంటివి ఉండ‌నున్నాయి.

ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై చర్యలు

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవో నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజులపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా మాజీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో తుది కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఫీజులపై తుది నిర్ణయం తీసుకుంటుంది. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజికవేత్తల అభిప్రాయాలను సేకరించేందుకు ఫీజు నియంత్రణ ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేలా తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుకు దారితీయనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories