టీఎస్పీఎస్సీ పేపర్ లీక్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. మార్చి నెలలో వెలుగు చూసిన ఈ కేసులో మొదట కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని అనుమానించారు. కానీ ఆ తర్వాత పోలీసుల విచారణలో పేపర్ లీక్ అయినట్లుగా గుర్తించారు. దీంతో మార్చ్ 12,14,16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. జనవరిలో 21న జరిగిన ఏఈ పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. ఏప్రిల్ నాలుగున జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్స్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. ఈ కేసులో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కోరారు. ఈ కేసులో ఇప్పటివరకు వందమందిని అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ అరెస్ట్
ఏప్రిల్ లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయం తెరమీదికి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసి, అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు ఆ తరువాత వరంగల్‌కు తరలించారు. మరునాటి సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్నారు. ఆయనపై ప్రధాన కుట్రదారు అనే అభియోగం మోపారు. ఆ తరువాత ఆయన బెయిల్ పై బైటికి వచ్చారు. ఈ కేసు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
ఈ యేడాది మొదట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ సౌత్ గ్రూప్ లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారనే విషయమై ఆరాతీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారని తేలడంతో ఆమెను ఈడీ విచారణకు పిలించింది. మొదటిసారి ఆమె నివాసంలోనే ప్రశ్నించిన ఈడీ..
ఆ తరువాత ఢిల్లీలో ప్రశ్నించింది. కవిత పర్సనల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేస్తారంటూ తీవ్ర ప్రచారం జరిగింది. ఒక సందర్భంలో కేసీఆర్ కూడా కవితను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని వ్యాఖ్యానించారు.. కానీ ఏం జరిగిందో తెలియదు.. కానీ ఆ తరువాత కవితపై కేసు అలాగే ఉంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజీపీ అధ్యక్షుడిగా నియమించింది. బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. కేసీఆర్ కు అనుకూలంగానే ఈ మార్పు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటు
అక్టోబర్ 21న మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయింది. అక్టోబర్ 24న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ దీన్ని పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ పరిశీలనలో పాల్గొంది. బ్యారేజీకి చెందిన 20, 21 పిల్లర్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్ ఐదు అడుగుల మేర కుంగిపోయింది. వీటితో పాటు.. 15 నుండి 20వ నెం. వరకు ఉన్న పిల్లర్లను నిపుణుల బృందం పరిశీలించింది. ప్రధానంగా 19, 20 పిల్లర్ల మధ్య కుంగుబాటుకు గురైందని నిపుణులు భావిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీరింగ్ సిబ్బందితో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చర్చించింది. ఆ తరువాత 28 వతేదీన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్రం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై 29వ తేదీలోపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపింది. మేడిగడ్డ వద్ద నిర్మించి న లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటుపై మొత్తం 20 ప్రశ్నలకు వివరణ కోరింది.
నాగార్జున సాగర్ వివాదం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి చెలరేగింది. నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన 700 మంది పోలీసులు డ్యామ్ మీదికి చొరబడ్డారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.. ఈ సమయంలో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని గతంలోనూ ఏపీ పోలీసులు ఘర్షణకు దిగారు. నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు ముళ్లకంచె వేశారు. ఎన్నికలకు కొద్ది గంటల ముందు జరిగిన ఈ వివాదం తీవ్ర దుమారం రేపింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
నవంబర్ ముప్పై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా హైదరాబాద్ లో పోలింగ్ నమోదయ్యింది. 119 నియోజకవర్గాల్లో చెదురు, మదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటాపోటీగా వార్ నడిచింది. కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ఆలస్యం కావడంతో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్
డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ ఎన్నికల రిజల్స్ట్ వచ్చాయి. కాంగ్రెస్ 64 సీట్ల మెజారిటీతో గెలుపొందింది. బీఆర్ఎస్ 39 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజార్టీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యింది.
ముఖ్యమంత్రిపై ఉత్కంఠ
డిసెంబర్ 4న కాంగ్రెస్ ముఖ్యమంత్రి విషయంలో గందరగోళం, తర్జన భర్జనలు ఏర్పడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిల మధ్య రేసు మొదలయ్యింది. నాలుగో తేదీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే శివకుమార్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళిసైని కలిసి తమ ఆమెదాన్ని తెలిపారు. రెండు రోజులపాటు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీకి, హైదరాబాద్ కు రాజకీయాలు వేడెక్కాయి. చివరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు 11మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదిక మీదినుంచే ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మారుస్తూ ప్రకటన చేశారు. అదే రోజు ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించారు. ఆ తరువాత రెండు రోజులు పరిణామాలు వేగంగా మారిపోయాయి. అప్పటివరకు ప్రభుత్వంలో ఉన్న అనేక మంది రాజీనామాలు చేశారు. విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. మంత్రులకు శాఖలు కేటాయించారు.
కేసీఆర్ కు గాయాలు
డిసెంబర్ 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌజ్ లో బాత్రూంలో కాలుజారి పడ్డారు. ఆయన తుంటి ఎముక విరగడంతో ఆ మరుసటి రోజు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.