Harish Rao: హ‌రీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారా.? ఏడున్న‌ర గంట‌ల విచార‌ణ‌లో ఏం తేలిందంటే

Published : Jan 21, 2026, 10:03 AM IST

Harish Rao: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఫోన్ అక్ర‌మ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం హ‌రీష్ రావును విచారించారు. 

PREV
17
హరీశ్‌రావుపై సిట్‌ సుదీర్ఘ విచారణ

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోని సిట్‌ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు. విచారణ మొత్తం ప్రశ్నల వర్షంతో కొనసాగినట్లు సమాచారం.

27
“నన్ను ఇరికించే ప్రయత్నం చేయొద్దు”

విచారణ ప్రారంభంలోనే తనపై తప్పుడు కేసు బిగించే ప్రయత్నం చేయవద్దని హరీశ్‌రావు సిట్‌ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తానని కూడా ఆయన పేర్కొన్నారని సమాచారం. ప్రశ్నలకు సమాధానాల సమయంలో చాలావరకు “గుర్తులేదు”, “తెలియదు”, “నేను నమ్మను” అనే పదాలే వినిపించాయని తెలిసింది.

37
ఎన్నికల నిఘాపై కీలక ప్రశ్నలు

2018 శాసనసభ ఎన్నికల అనంతరం హరీశ్‌రావు సహా అప్పటి భారాస సీనియర్‌ నేతల ఫోన్లపై ఏడాది పాటు నిఘా కొనసాగిందని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అలాంటి నిఘా తనకు తెలియదని, ఆ ఆరోపణలను నమ్మలేనని హరీశ్‌రావు చెప్పినట్లు సమాచారం. అధికారులు చూపిన కొన్ని ఆధారాలను కూడా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.

47
సర్వేలు, సమావేశాలు, అనుమానాలు

ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావు మధ్య జరిగిన సంభాషణలు, లావాదేవీలపై సిట్‌ ప్రశ్నలు సంధించింది. 2023 అక్టోబరులో శ్రవణ్‌రావు నిర్వహించిన సర్వేలో భారాసకు 40 సీట్లకు మించవని రావడం, నిఘా విభాగం అంచనాలు భిన్నంగా ఉండటంతో ఆ అంశంపై చర్చించేందుకే సమావేశం ఏర్పాటు చేశానని హరీశ్‌రావు చెప్పినట్లు సమాచారం. జిల్లాల్లో ప్రత్యర్థి నేతలపై నిఘా పెట్టాలనే ఆదేశాలు తాను ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

57
దుబ్బాక ఉపఎన్నికలు, పరికరాల కొనుగోలు అంశం

దుబ్బాక ఉపఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు కదలికలపై నిరంతర నిఘా ఎలా సాధ్యమైందని సిట్‌ ప్రశ్నించింది. ఆయన వాహన తనిఖీలపై కూడా వివరాలు అడిగింది. ఈ వ్యవహారానికి ఫోన్‌ ట్యాపింగ్‌ కారణమనే ఆరోపణలున్నాయని అధికారులు పేర్కొన్నారు. తనకు అవి ఎలా తెలుస్తాయంటూ హరీశ్‌రావు సమాధానమిచ్చినట్లు సమాచారం. మరోవైపు, ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిఘా విభాగ పరికరాల కొనుగోలుకు అధిక నిధులు ఎందుకు మంజూరు చేశారన్న ప్రశ్నకు పోలీస్‌శాఖ విజ్ఞప్తి మేరకే అలా జరిగిందని తెలిపారు.

67
విచారణకు విరామం, మరోసారి నోటీస్‌

తన కుమారుడికి విమాన ప్రయాణం ఉందని తెలియజేయడంతో విచారణకు తాత్కాలికంగా ముగింపు పలికారు. కేసుతో సంబంధమున్న సాక్షులను సంప్రదించవద్దని సిట్‌ అధికారులు హరీశ్‌రావుకు స్పష్టం చేశారు. త్వరలో మరోసారి విచారణకు పిలిచే అవకాశముందని, ఒకటి రెండు రోజుల్లో నోటీస్‌ జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో ఇద్దరు ప్రముఖులపై కూడా సిట్‌ దృష్టి పెట్టినట్లు సమాచారం.

77
తప్పుడు ప్రచారాలపై సజ్జనార్‌ హెచ్చరిక

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు 2024 మార్చి 10 నుంచి కొనసాగుతోందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలపై అనధికార నిఘా ఆరోపణలపైనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరిపై ఛార్జ్‌షీట్‌ దాఖలైందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ విచారణ జరుగుతోందన్న ప్రచారం అసత్యమని, ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories