
School Holidays : మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి... నిన్న(సోమవారం) తుపాను ఏర్పడి అదికాస్త ఇవాళ(మంగళవారం) తీవ్ర తుపానుగా మారింది. రాత్రికి (అక్టోబర్ 28) ఈ మొంథా తుపాను కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.
మొంథా తుపాను ప్రభావం ఏపీలో గట్టిగా ఉంటుందని... తెలంగాణలోని కొన్ని జిల్లాలపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తోంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం నుండి తెలంగాణలో భారీ వర్షాలు మొదలవుతాయని... రేపు (బుధవారం) మొత్తం కొనసాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మొంథా తుపాను ప్రభావిత తెలంగాణ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి.
అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే ఇవాళ, రేపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా 90 నుండి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో 40 నుండి 70 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణపై కూడా మొంథా తుపాను ఎపెక్ట్ ఉంటుందని స్పష్టమవుతోంది.
ఇలా మొంథా తుపాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే భారీ నుండి అతిభారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివున్న జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సెలవులు ప్రకటించింది. తమిళనాడులో కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా తుపాను ప్రభావిత జిల్లాల్లో రేపు (అక్టోబర్ 29న) సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 26న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతోనే భారీ వర్షాలు మొదలయ్యాయి... సోమవారం తుపాను, మంగళవారం తీవ్ర తుపాను ఏర్పడటంతో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుండటంతో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు మొదలై బుధవారం కూడా కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 27,28,29 మూడ్రోజులు తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం.
విశాఖపట్నంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, బాపట్ల, కడప, గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, చిత్తూరు, కోనసీమ, కృష్ణా, ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలు గత రెండ్రోజులుగా మూతపడ్డాయి. చాలాజిల్లాల్లో రేపు (బుధవారం) కూడా సెలవు ఇచ్చారు. మొంథా తుపాను తీరందాటే కాకినాడ జిల్లాలో కొన్నిచోట్ల అక్టోబర్ 31 వరకు సెలవులుండే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం మొంథా తుపాను కాస్త తీవ్రతుపానుగా బలపడిందని... ఇది పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతం గంటకు 12 కి.మీ వేగంతో కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరంవైపు దూసుకువస్తోందని హెచ్చరించింది. ఈ తుపాను మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో ఉందని APSDMA వెల్లడించింది. ఇవాళ రాత్రి తీరందాటే అవకాశాలున్నాయని... ఈ సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయట. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.