
Cyclone Montha : తెలంగాణపై కూడా మొంథా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరీ ఆంధ్ర ప్రదేశ్ స్థాయిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రమాదం ఉండదని... కానీ కొన్నిజిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం ఉన్నాయంటోంది. కాబట్టి నేడు, రేపు (అక్టోబర్ 28,29 తేదీల్లో) మొంథా తుపాను ప్రభావిత తెలంగాణ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలపై మొంథా తుపాను ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (అక్టోబర్ 28, మంగళవారం) ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ కుండపోత వర్షాలతో ప్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది IMD.
ఇక మంగళవారం తెలంగాణలోని మరో 21 జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇలాంటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాప్రకారం... అక్టోబర్ 28న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ లో జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 90 నుండి 150 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాల్లో 40-70 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 3-4 విడతలుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వైదర్ మ్యాన్ అంచనా.
రేపు బుధవారం అంటే అక్టోబర్ 29న కూడా మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఆదిలాబాద్, కొమ్రంబీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట , మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలపై మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అందుకే ఈ జిల్లాల్లోనే ఈ రెండ్రోజులు (అక్టోబర్ 28,29 తేదీల్లో) భారీ నుండి అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం మధ్యాహ్నం వరకు మొంథా తుపాను ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని... ఈ సమయంలోనే అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారానికి పరిస్థితి ప్రశాంతంగా మారే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో వర్షబీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ తీవ్ర తుపానుగా మారడం, తీరం దాటనుండటంతో బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ఇవాళ పలుజిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు... ప్రజలను కూడా వివిధ మార్గాల్లో అలర్ట్ చేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా మొంథా ఎఫెక్ట్ కనిపిస్తోంది. మొత్తంగా దక్షిణ భారతదేశాన్ని మొంథా తుపాను తడిసిముద్ద చేస్తోంది... ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తోంది.