BRS: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోడ్ రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులు ఓటర్లను అయోమయానికి గురిచేసే అవకాశం ఉందని గులాబీ నేతలు కంగారు పడుతున్నారు.
జూబ్లి హిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని గుర్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై గులాబీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు అయోమయానికి గురై, తప్పుడు బటన్ నొక్కి తమ ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని వారు కంగారు పడుతున్నారు. ఈ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
25
మొత్తం 58 మంది అభ్యర్థులు
ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ ఫ్రీ సింబల్స్‌ను కేటాయించింది. ఈసీ జాబితాలో ఉన్న కొన్ని గుర్తులు బీఆర్ఎస్ పార్టీ సింబల్ అయిన కారు గుర్తును పోలి ఉండడం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వంలో టెన్షన్ పెంచుతోంది. ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతి మేకర్, క్యాప్ వంటి గుర్తులు కారు గుర్తును అచ్చం పోలి ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.
35
బీఆర్ఎస్‌కు చేదు జ్ఞాపకాలు
గత 2023 అసెంబ్లీ ఎన్నికల అనుభవం బీఆర్ఎస్‌కు ఈ విషయంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21 నియోజకవర్గాల్లో గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈ కారు లాంటి సింబల్స్ వల్ల అనూహ్యంగా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని వారు గుర్తుచేస్తున్నారు.
ఆ ఓట్లు తమ పార్టీకి రాకుండా పక్కకు మళ్లాయని బీఆర్ఎస్ నాయకత్వం నమ్ముతోంది. ఇప్పుడు కూడా అలాంటి గుర్తులు ఉండడం తమకు పెద్ద నష్టం కలిగిస్తుందని భయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిపోయిన బీఆర్ఎస్.. జూబ్లి హిల్స్ ఉపఎన్నికలో గెలిచి మళ్లీ పూర్వవైభవాన్ని పొందాలని భావిస్తోంది. ఇటువంటి కీలక సమయంలో కారును పోలిన గుర్తుల వల్ల ఓటర్లకు గందరగోళం ఏర్పడి, పార్టీ ఓట్లను కోల్పోతే, అది బీఆర్ఎస్‌కు చాలా పెద్ద నష్టమే అవుతుందని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది.
55
బీఆర్ఎస్ వ్యూహాం
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఒక వ్యూహాన్ని రచించింది. ఈసారి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరుతో పాటు, వారి కలర్ ఫోటో కూడా ఉంటుందని ప్రచారంలో ఓటర్లకు కీ పాయింట్‌గా చెప్పాలని ప్లాన్ చేస్తోంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరును, ఫోటోను చూసి మాత్రమే బటన్ నొక్కాలని స్పష్టం చేయాలని నిర్ణయించారు. పోటాపోటీగా జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో ఒక్క కన్ఫ్యూజ్ ఓటు కూడా చాలా కీలకమయ్యే అవకాశం ఉంది కాబట్టి, కారు గుర్తును ఒకటి లేదా రెండు సార్లు చూసి, సరిగ్గా నొక్కాలని ఓటర్లకు చెప్పాలని బీఆర్ఎస్ ప్రచార శ్రేణులు కోరుతున్నాయి.