Published : Oct 28, 2025, 08:02 PM ISTUpdated : Oct 28, 2025, 08:07 PM IST
IMD Rain Alert : మొంథా తుపాను ఈ రాత్రికి తెలంగాణలో కూడా అల్లకల్లోలం సృష్టించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఓ మూడు జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీచేసింది.. దీన్నిబట్టి ఏ స్థాయిలో వర్షాలుంటాయో అర్థంచేసుకోవచ్చు.
Cyclone Montha : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరికొద్దిసేపట్లో తీరం దాటనుంది. కాకినాడ-మచిలీపట్నం మధ్యలో ప్రచండమైన ఈదురుగాలులతో తుపాను తీరం దాటేందుకు సిద్దంగా ఉంది... దీని ప్రభావంతో ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణపై తుపాను ప్రభావం ఉంటుందని... కొన్నిజిల్లాల్లో ఏపీలో కురిసే స్థాయిలోనే వానలు పడతాయంటోంది. ఇలా తుపాను తీరందాటాక ఈ రాత్రంతా పలు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
25
ఈ రాత్రికి తెలంగాణలో రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావం ఈస్ట్ తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని... ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసే అవకాశాలున్నాయని... గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఇలా ప్రమాదకర స్థాయిలో వర్షం కురిసే అవకాశాలున్న ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది... అంటే ఈ జిల్లాల ప్రజలు ఈ రాత్రికి చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట.
35
ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ రాత్రి భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది... ఇక్కడి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
మొంథా తుపాను తీరం దాటాక ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా కొమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
55
మొంథా తుపాను ఎక్కడుంది?
ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 15 కి.మీ వేగంతో ఈ తుపాను ముందుకు కదులుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది... అంటే మరికొద్దిగంటల్లోనే ఇది తీరం దాటనుంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరిస్తోంది.