Big Story: అస‌లు త‌ప్పు ఎక్క‌డుంది? తొమ్మిదో త‌ర‌గ‌తి బాలిక‌లు చేసిన ప‌ని స‌మాజానికి స‌వాలు విసురుతోంది.

Published : Sep 26, 2025, 09:45 AM IST

Big Story: మారిన టెక్నాల‌జీతో మ‌నిషి కూడా అప్‌గ్రేడ్ అయ్యాడు. అయితే ఈ పెరుగుట విరుగుట‌కేనా అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌మాజానికి ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తోంది. 

PREV
18
హైద‌రాబాద్‌ను కుదిపేసి మైనర్ బాలికల వ్య‌వ‌హారం

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలను మాయమాటలు చెప్పి యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

28
ఎలా మొదలైంది ఘటన?

ఈ నెల 20న బడిలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ముగ్గురు బాలికలు ఇంటి నుంచి బయలుదేరారు. కానీ స్కూల్‌కు వెళ్లకుండా సికింద్రాబాద్ వైపు తిరిగారు. అక్కడ బస్టాప్ వద్ద జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి గండికోట మధు (19) వీరిని కలిశాడు. కొద్ది సేపట్లో తన స్నేహితుడు వంశీ అరవింద్ (22), బంధువు ఈసం నీరజ్ (21)ను కూడా అక్కడికి పిలిపించాడు.

38
యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన నిందితులు

మొదట వారందరూ కలిసి ఒక హోటల్‌లో భోజనం చేశారు. బాలికలతో బాగా మాట‌లు కలిపిన త‌ర్వాత సరదాగా బయటకు వెళ్దామని చెప్పి బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో మూడు వేర్వేరు గదులు బుక్‌ చేసి, బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డారు.

విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది.?

మరుసటి రోజు సాయంత్రం బాలికలను తిరిగి హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంతంలో వదిలేశారు. అయితే 20వ తేదీన ముగ్గురు విద్యార్థినీలు స్కూలుకు రాకపోవడంతో తల్లిదండ్రులకు టీచర్ ఫోన్ చేశారు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మర్నాడు ఆదివారం ఉదయం బాలికలే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తాము యాదగిరిగుట్టకు వెళ్లివచ్చామని చెప్పారు. అయితే మొద‌ట ఎవ‌రితో వెళ్లారు.? ఏం జ‌రిగింది.? అని ప్ర‌శ్నించ‌గా బాలిక‌లు మౌనంగా ఉన్నారు. కానీ గ‌ట్టిగా అడ‌గ‌డంతో చివరికి ధైర్యం తెచ్చుకుని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించారు. వెంటనే తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులను సంప్రదించడంతో కేసు నమోదైంది.

48
పోలీసుల విచార‌ణ

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. బాలికల వాంగ్మూలం, వైద్య పరీక్షల ఆధారంగా లైంగికదాడి జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు. వెంటనే మధు, వంశీ అరవింద్, నీరజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు మైనర్లు అని తెలిసి కూడా గది ఇచ్చిన లాడ్జి యజమాని సోమేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

స‌మాజానికి చెబుతోన్న గుణ పాఠాలు ఏంటి.?

హైద‌రాబాద్‌లో చోటు చేసుకున్న మైనర్ బాలికల లైంగికదాడి ఘటన ప్రతి ఒక్కరికీ కుదిపేసేలా ఉంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు అనుమానాస్పదంగా బయటకు వెళ్లి చివరికి దారుణ అనుభవానికి గురయ్యారు. ఈ సంఘటన ఒక్క కుటుంబానిదే కాదు, సమాజానిదే సమస్య అని చెప్పాలి. అసలు తప్పు ఎక్కడ జరిగింది? పిల్లలు ఎందుకు ఇలా మోసపోతున్నారు? తల్లిదండ్రులు, సమాజం ఏం నేర్పాలి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దారుణ ఘ‌ట‌న స‌మాజానికి ఎలాంటి గుణ పాఠాలు నేర్పిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

58
ఇత‌రుల‌తో పోల్చుకోవ‌డం

సోష‌ల్ మీడియా టీనేజ‌ర్ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా అవ‌త‌లి వ్య‌క్తులు పోస్ట్ చేసే పోస్టుల‌ను చూసి వాళ్ల‌లా మ‌నం ఉండ‌లేక‌పోతున్నాం, వారిలో మ‌నం తిర‌గ‌లేక‌పోతున్నామన్న ఆత్మ‌న్యూన‌త భావం చాలా మందిలో పెరిగిపోతోంది. ఇత‌రుల లైఫ్ స్టైల్‌తో మ‌న జీవితాన్ని పోల్చుకుంటున్నారు. దీంతో ఎవ‌రైనా అలాంటి జీవితాన్ని అందిస్తామ‌ని ఆశ చూపితే ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఓ అధ్యయనం ప్ర‌కారం, 12–15 ఏళ్ళ పిల్లల్లో రోజుకు 3 గంటలకన్నా ఎక్కువ సోషల్ మీడియా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్య సమస్యల (డిప్రెషన్, ఆందోళన) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.

తల్లిదండ్రుల పాత్ర ఏంటి.?

ఈ ఘటనలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా బయటపడింది. పిల్లలు "బతుకమ్మ వేడుక ఉంది" అని చెప్పి బయటకు వెళ్ళి, రోజంతా రాకపోతే అదే రోజు కంగారు పడాల్సింది. కానీ మరుసటి రోజు టీచర్ ఫోన్ చేసే వరకు పెద్దగా ఆందోళన కనిపించలేదని తెలుస్తోంది. ఇది నిర్లక్ష్యం అని చెప్పక తప్పదు. పిల్లలపై నిఘా, పాఠశాలతో నిరంతర సంబంధం పెట్టుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్ల‌ల‌కు ఫీజులు కడుతున్నాం, అడిగింది కొనిస్తాం ఇంకేం చేస్తామ‌న్న ప‌రిధి దాటి.. వారు ఏం చేస్తున్నారు.? వారు ఎలా ఆలోచిస్తున్నార‌న్న విష‌యాల‌ను కూడా పేరెంట్స్ గ‌మ‌నించాల‌న్న ప్రాధాన్య‌త‌ను కూడా ఈ సంఘ‌ట‌న గుర్తు చేస్తుంది.

68
సమాజం తప్పు లేదా.?

సమాజం మొత్తం ఇలాంటి ఘటనలకు దోహదం చేస్తోంది. మైనర్లను అనుమతి లేకుండా గదులు ఇచ్చే లాడ్జి యజమానులు, అనుమానం కలిగే పరిస్థితుల్లో కూడా మౌనం పాటించే పరిసరాలు ఇవ‌న్నీ ఈ వ్యవహారంలో భాగమే. వయసు తక్కువగా ఉన్నవారికి గది ఇచ్చిన లాడ్జి యజమాని తప్పు పెద్దదే. అంతేకాదు, సమాజం ఇలాంటి ఘటనలను చూసి "మనకేమిటి" అనే నిర్లిప్త ధోరణి కూడా సమస్యకారకమే. మ‌నం నేరం చేయ‌క‌పోవ‌డ‌మే కాదు, మ‌న చుట్టూ జ‌రుగుతోన్న నేరాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా నేర‌మే అవుతుంద‌న్న విష‌యాన్ని ఈ సంఘ‌ట‌న చెప్ప‌క‌నే చెబుతుంది.

78
అమ్మాయిల‌నే త‌ప్పు ప‌ట్ట‌డం కూడా త‌ప్పే.?

ఈ సంఘ‌ట‌న గురించి తెలిసిన వారు ఎవ‌రైనా అమ్మాయిలదే త‌ప్ప‌ని న‌ర్మోహ‌టంగా చెబుతారు. అయితే ఇక్క‌డ అమ్మాయిలు మోస‌పోయార‌ని చెప్ప‌డంలో ఎంత నిజం ఉందో.. మోసం చేసింది కూడా అబ్బాయిలే అన్న విష‌యం అంతే నిజం. ఓ 19 ఏళ్ల కుర్రాడు రాత్రికి ఇంటికి రాక‌పోతే ఎక్క‌డికి వెళ్లావ‌ని ప్ర‌శ్నించ‌ని మ‌ధు పేరెంట్స్‌ది కూడా. అమ్మాయిల‌కు జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం ఎంత ముఖ్య‌మో.. ఇంట్లో ఉన్న అబ్బాయిల‌కు కూడా జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం అంతే ముఖ్యమ‌ని స‌మాజం గుర్తుంచుకోవాలి. అబ్బాయిలు ఏం చేసినా ప‌ర్లేద‌న్న అభిప్రాయం మారాలి. వారు చేసే ప‌నుల‌పై కూడా ఒక నిఘా పెట్టాలి.

88
మొత్తంగా చెప్పాలంటే..

ఈ ఘటన ఒక పాఠశాల విద్యార్థినుల గురించి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి హెచ్చరిక. పిల్లలు అమాయకంగా మోసపోతే దానికి తల్లిదండ్రులు, గురువులు, సమాజం అందరూ బాధ్యత వహించాలి. టెక్నాలజీ పెరుగుతున్నా, లోకజ్ఞానం తగ్గిపోతే ఇలాంటి విషాదాలు ఆగవు. తప్పు ఎవరిదో ఒకరిపై నెట్టేయడం కాదు, అందరం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన సమయం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories