
గతనెల 13వ తేదీన భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన స్వామి అనే ఓ వ్యక్తిని కారు ఢీకొనడంతో మరణించాడు. బైక్‌పై భువనగిరి వస్తున్న సమయంలో అతన్ని కారు ఢీకొట్టింది. అందరూ దీనిని తొలుత ఓ ప్రమాదంగానే భావించారు. అయితే ఆ ప్రమాదం వెనుక నిజం వేరే ఉంది. అది కేవలం రోడ్డు ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ చేసిన హత్య. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి రాగానే, భువనగిరి జిల్లా కాటేపల్లి ప్రాంతం మొత్తం షాక్‌కు గురైంది.
ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి (36) మృతుడు. భార్య స్వాతితో ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. భువనగిరిలోని ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి మాత్రం భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్యోగం చేస్తూ, అక్కడే గుంటిపల్లి సాయికుమార్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే స్వామి తరచూ భార్యను ఈ విషయమై ప్రశ్నించేవాడు. మరోవైపు, స్వాతి సోదరుడు మహేశ్‌కు కూడా స్వామిపై పగ ఉంది. తన భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం కారణంగా అతడు ఎప్పటినుంచో కోపంతో ఉన్నాడు. ఇలా భర్త వేధింపులు, బావ పగ – రెండు కోణాలు కలసి, చివరికి రహస్య హత్యకు దారితీశాయి.
జూలై 13వ తేదీ రాత్రి, స్వామి భువనగిరిలో పని ముగించుకుని స్నేహితుడు వీరబాబుతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కాటేపల్లి శివారులో వారిని సాయికుమార్ కారుతో ఢీకొట్టాడు. బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లాడు కూడా. స్వామి అక్కడికక్కడే చనిపోగా, వీరబాబు గాయాలతో బయటపడ్డాడు. ఆ కారు కొద్దిదూరం వెళ్లి రోడ్డు పక్కన ఆగిపోయింది. బయటకు చూసిన వారికి అది సాధారణ ప్రమాదంలా కనిపించింది. కానీ అక్కడే పోలీసుల కంటికి చిన్న అనుమానం తగిలింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. బైక్‌ను ఢీకొట్టిన కారు సాధారణంగా ప్రమాదం జరిగిందని అనిపించలేదు. ఆ కారు నంబర్‌ను ట్రేస్ చేస్తే, అది సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నదని తెలిసింది. కారు తీసుకున్నవాడు సాయికుమార్. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, అసలు కథ బయటపడింది. అతని ఫోన్‌లో స్వాతితో తరచూ సంప్రదింపులు ఉన్నట్టు బయటపడింది. ఆ తరువాత స్వాతిని ప్రశ్నించగానే, ఆమె నిజం ఒప్పుకుంది.
స్వాతి ఒప్పుకున్న వివరాలు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. భర్త వేధింపులతో విసిగి, ప్రియుడితో కలిసి హత్య చేయాలని డిసైడ్ చేసింది. అంతేకాదు, సోదరుడు మహేశ్ కూడా ఈ ప్లాన్‌లో భాగమయ్యాడు. కారు అద్దెకు తీసుకుని, స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో స్వామిపై రహస్యంగా నిఘా పెట్టారు. సరైన సమయానికి కారు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలా చూపించాలనుకున్నారు. కానీ ఢీకొట్టడానికి ఉపయోగించిన ఆ కారే వారిని పట్టించింది.
ఈ కేసులో భార్య స్వాతి, ప్రియుడు సాయికుమార్, సోదరుడు మహేశ్ – ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. ఇలా హత్యను ప్రమాదంగా చిత్రీకరించబోయి ప్రస్తుతం ఆ ముగ్గురు జైల్లో ఊసలు లెక్కిస్తున్నారు.
ఇలాంటి నేరాలు ప్రతీ ఒక్కరికీ గుణపాఠం కావాలి. సమాజంలో బతికే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. ఈ కేసులో స్వాతి తన భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ భర్తనే లేకుండా చేయాలని చూసింది. అలాగే స్వామికి తన భార్యపై అనుమానం ఉంటే న్యాయపరంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. కానీ భార్యను వేధించాడు. ఇలా తెలిసో తెలియకో చేసిన తప్పులు ఎప్పటికైనా తగిన మూల్యాన్ని చెల్లిస్తాయి.