
Sahasra Murder Case : పెంపకంలో లోపమో, సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసో, కొన్నిరకాల సినిమాల ప్రభావమోగానీ నేటితరం యువతలో వైలెంట్ నేచర్ పెరిగిపోయింది. హింసను హీరోయిజంగా భావించేవారి సంఖ్య పెరిగిపోతోంది... చివరకు అభంశుభం తెలియని చిన్నారుల్లోనూ ఈ హింసాత్మక మనస్తత్వం పెరిగిపోయింది. నేటితరం పిల్లలు ఎంత వైలెంట్ గా తయారయ్యారో తాజాగా హైదరాబాద్ లో జరిగిన చిన్నారి సహస్ర హత్యకేసు బైటపెట్టింది. చిన్న సరదా కోసం తోటి చిన్నారిని అత్యంత కిరాతకంగా హతమార్చాడో పదోతరగతి బాలుడు... ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి సంగీత్ నగర్ కాలనీలో కృష్ణ-రేణుక దంపతులు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. సంగారెడ్డి జిల్లాకుచెందిన ఈ దంపతులకు 10 ఏళ్ల సహస్రతో పాటు 8 ఏళ్ళ కుమారుడు సంతానం. బాలిక బోయిన్ పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతోంది... బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. రోజూ తల్లిదండ్రులిద్దరు పనికి వెళ్ళగా ఇద్దరు పిల్లలు స్కూళ్లకు వెళ్ళేవారు.. ఇలా పగలంతా వారి ఇంటికి తాళం వేసివుండేది... ఇదే పాప ప్రాణంమీదకు తెచ్చింది.
కృష్ణ కుటుంబం నివాసముండే ఇంటిపక్కనే ఓ అపార్ట్ మెంట్ లో నివాసముండే బాలుడు రోజూ పగటిపూట ఈ ఇంటికి తాళం వుండటం గమనించేవాడు. దీంతో పట్టపగలే ఈ ఇంట్లో దొంగతనానికి పథకం వేశాడు... కానీ ఇతడు ఇంట్లోకి చొరబడ్డరోజు సహస్ర కు సెలవు ఉండటంతో ఇంటివద్దే ఉంది. ఇంట్లోకి చొరబడ్డ బాలుడిని ఆమె చూడటంతో తన దొంగతనం బండారం బైటపడుతుందని భయపడి దారుణానికి ఒడిగట్టాడు… అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చాడు. తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించాడు... కానీ పోలీసుల విచారణలో బాలుడు పట్టుబడ్డాడు.
పోలీసులు కథనం ప్రకారం... ఆగస్ట్ 18 అంటే గత సోమవారం తల్లిదండ్రులు కృష్ణ-రేణుక పనులకు, సోదరుడు స్కూల్ కి వెళ్లగా సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది. అయితే వీరి ఇంటిపక్క అపార్ట్ మెంట్ లో నివాసముండే ప్రకాశం జిల్లాకు చెందిన పదోతరగతి బాలుడు (నిందితుడు) ఎప్పట్నుంచో వీరిఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పగటిపూట ఆ ఇంటికి తాళం వేసివుంటుంది కాబట్టి దాన్ని ఎలా పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాలి... దొంగతనం తర్వాత ఏం చేయాలి అనేది మొత్తం ఓ ప్లాన్ రెడీచేసుకున్నాడు... దీన్ని ఓ కాగితంపై కూడా రాసుకున్నాడు.
అయితే అతడు గత సోమవారం తన ప్లాన్ ను అమలు చేయడానికి సిద్దమై స్కూల్ కి డుమ్మా కొట్టాడు... తమ అపార్ట్ మెంట్ పైనుండి పక్క భవనంలోకి దూకాడు. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు ఇంట్లో ఎవరూ ఉండరని భావించాడు.. కానీ సహస్ర ఉండటంతో అతడు కంగుతిన్నాడు. ఆమె టీవి చూస్తుండటం... తలుపు తెరిచివుండటంతో తన దొంగతనం ప్లాన్ ను కొనసాగించాడు. కానీ చివర్లో ఇంట్లో అలికిడి రావడంతో సహస్ర వెళ్లిచూడగా పక్కింటి బాలుడు కనిపించాడు... దీంతో తన దొంగతనం వ్యవహారం భయటపడుతుందని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చిన్నారిని చంపేసి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం సహస్ర తండ్రి ఇంటికిరాగా కూతురు రక్తపుమడుగులో పడివుండటం గమనించాడు. దీంతో అతడు బోరున విలపిస్తూ కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల విచారణ సమయంలోనూ నిందితుడు తనకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరించాడు. కానీ ఓ వ్యక్తి ఈ బాలుడు ఈ బిల్డింగ్ లోకి దూకడాన్ని చూశాడు.. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపగా సహస్ర హత్య మిస్టరీ వీడింది... పదో తరగతి చదివే ఈ బాలుడే నిందితుడిగా బైటపడింది.
సహస్ర సోదరుడు చదివే స్కూల్లోనే నిందితుడు కూడా చదువుతున్నాడు. ఇతడి కుటుంబంతో గతంలో కిరాణాషాప్ నడిపేది... అయితే నష్టాల కారణంగా దాన్ని మూసేశారు. ప్రస్తుతం కుటుంబ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో బాలుడి అవసరాలకు డబ్బులు ఇచ్చేవారుకాదు... దీంతో అతడు చిన్నచిన్న సరదాలు కూడా తీర్చుకోలేకపోతున్నానే అని బాధపడేవాడు. ఈ క్రమంలో బాలుడు హర్రర్, క్రైమ్ సినిమాలు చూస్తుండటంతో క్రిమినల్ ఆలోచనలు పెరిగిపోయాయి. ఇదే అతడిని సహస్రను హత్యచేసేలా ప్రేరేపించింది.
పక్కపక్కన ఇళ్ళు, ఒకే స్కూల్లో చదువుతుండటంతో సహస్ర సోదరుడితో నిందితుడికి స్నేహం ఉంది. అప్పుడప్పుడు వీళ్లు మిగతా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవారు. ఈ సమయంలోనే సహస్ర సోదరుడి దగ్గరున్న బ్యాట్ నిందితుడికి ఎంతగానో నచ్చింది. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న బాలుడు దొంగతనానికి వెళ్లి దారుణానకి పాల్పడ్డాడు. బ్యాట్ ను తీసుకుని వెళుతున్న నిందితుడికి సహస్ర చూసి అడ్డుకోవడంతో ఆమెను తోసేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో సహస్ర భర్త్ డే జరిగింది. ఈ వేడుకలకు ఇంటి చుట్టుపక్కల పిల్లలంతా రాగా హత్యచేసిన బాలుడు కూడా వచ్చాడు. సహస్రకు కేక్ తినిపించి ఫొటో కూడా తీసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అతడే బాలికను చంపినట్లు తెలిసి కాలనీవాసులు ఆశ్చర్యపోతున్నారు. నేరం అంగీకరించడంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.
అయితే తమ బిడ్డ మరణానికి న్యాయం చేయాలంటే సహస్ర తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించిన పోలీసులు తగిన న్యాయం జరిగేలా, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.