నిజాబాబాద్ లో పూర్తి స్థాయి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించి, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పసుపు పంటపై ప్రత్యేకంగా దృష్టిసారించే ఈ బోర్డు పసుపు పరిశోధన, మార్కెట్ అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ప్రాసెసింగ్, ఎగుమతులపై దృష్టి పెడుతుంది. ఈ బోర్డులో ఆయుష్, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖలతో పాటు పసుపు రైతుల ప్రతినిధులు, ఎగుమతిదారులు పాల్గొంటారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం పని చేస్తున్నా, దీనిని బోర్డు అనుబంధంగా అభివృద్ధి చేస్తే మరింత లాభాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేసే దేశంగా టాప్ లో ఉంది. ప్రపంచ పసుపు వ్యాపారంలో దాదాపు 62 శాతానికి పైగా వాటా భారత్‌కు ఉంది. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో పసుపు సాగు విస్తృతంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లకు పైగా పసుపు సాగు జరుగుతోంది.