
శనివారం మధ్యాహ్నం సమయంలో ఉన్నట్లుండి కొంత మంది వ్యక్తులు హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయంపైకి దాడికి దిగారు. ఈ క్రమంలో కొంత మంది మహా న్యూస్ స్టాఫ్‌కు గాయాలయ్యాయి. అలాగే ఫర్నిచర్, అద్దాలతో పాటు ఆఫీస్ బయట ఉన్న కార్లను ధ్వంసం చేశారు.
ఈ చర్యను మహా న్యూస్ తీవ్రంగా ఖండించింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విగాతమని, నిజాలు చెప్పే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేటీఆర్ వర్గీయులు చేసిన దాడి అని మహా న్యూస్ ఆరోపించింది.
మహాన్యూస్‌పై దాడి చేసింది కేటీఆర్, బీఆర్ఎస్ వర్గీయులేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు కేటీఆర్‌కు సంబంధం ఏంటన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పలువురి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతోంది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే సాగినట్లు మహా న్యూస్ టెలికాస్ట్ చేసింది. కేటీఆర్ కొంత మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి వారి మాటలను రహస్యంగా విన్నారంటూ డిబేట్ నిర్వహించారు. అయితే ఇది నచ్చని కొందరు మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేశారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు!” అని రాసుకొచ్చారు.
కొంతమంది మీడియా సంస్థలు, విలేకరులు తనపై వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ దాడులు తన కుటుంబ సభ్యులపై, పార్టీ శ్రేణులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని, వీటిని చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.
కాగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు స్పందిస్తున్నారు. మహాన్యూస్ తీరు ఏమాత్రం బాగాలేదని అంటున్నారు. విచారణ జరుగుతోన్న సమయంలో ఆ అంశాలను ప్రస్తావించడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే అసహ్యమైన, అభ్యంతకరమైన థంబ్ నెయిల్స్‌తో వ్యక్తిత్వ హననం చేయడం జర్నలిజమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు
మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ విషయమై ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. 'తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను' అని రాసుకొచ్చారు.
ఈ దాడిని ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఖండించాలని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై ఓ పోస్ట్ చేశారు. 'హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది.
ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ అంశం ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. 'హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను' అని పేర్కొన్నారు.