T20 World Cup: ప్రపంచకప్ లో సెంచరీలు చేసిన మొనగాళ్లు వీళ్లే.. ఈసారి ఆ ఘనత అందుకునేది ఎవరో...?

First Published Oct 21, 2021, 3:01 PM IST

Centuries in T20 World cup: 2007 లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ నుంచి 2016 దాకా ఇప్పటివరకు ఆరు వరల్డ్ కప్ లు ముగిశాయి. బ్యాట్స్మెన్ వీర విహారం చూపించే ఈ ఫార్మాట్ లో బౌలర్లు తేలిపోవాల్సిందే. అయితే ఈ బిగ్ టోర్నీలో సెంచరీ సాధించాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లో వంద పరుగులు కొట్టిన మొనగాళ్లు ఎవరో ఇక్కడ చూద్దాం. 

టీ20 అంటేనే 20 ఓవర్ల ఆట. టెస్టులు, వన్డేలలో మాదిరిగా తీరికగా ఆడతాం అంటే కుదరదు. అంతా క్షణాల్లో జరిగిపోవాల్సిందే. ఈ ధనాధన్ ఆటలో సెంచరీ చేయడం అంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ కొంత మంది బ్యాట్స్మెన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వాళ్లెవరంటే.. 

టీ20 ప్రపంచకప్ లో మొదటి సెంచరీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సాధించాడు. ఈ విండీస్ విధ్వంసకర ఆటగాడు.. 2007లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో 57 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి. 

ఈ జాబితాలో రెండో సెంచరీ సాధించిన ఆటగాడు భారత మాజీ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా. 2010 లో దక్షిణాఫ్రికాపై 60 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. 
 

2010 టీ20 ప్రపంచకప్ సమయంలోనే శ్రీలంకకు చెందిన మహేళ జయవర్దనే కూడా సెంచరీ కొట్టాడు. జింబాబ్వే తో జరిగిన  మ్యాచ్ లో అతడు 64 బంతుల్లోనే వంద పరుగులు సాధించాడు. 

2012 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్  ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ సెంచరీ చేశాడు. అతడు.. 58 బంతుల్లోనే 123 పరుగులు చేసి ఔటయ్యాడు. 

2014 ప్రపంచకప్ లో  ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో అతడు 64 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు. 

2014 ప్రపంచకప్ లోనే పాకిస్థాన్ ఆటగాడు అహ్మద్ షాజాద్ కూడా సెంచరీ కొట్టాడు. బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లోనే అతడు.. 62 బాల్స్ లో 111 పరుగులు  రాబట్టాడు. 

2016 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ఈ రికార్డు సాధించాడు. ఓమన్ పై జరిగిన మ్యాచ్ లో అతడు 63 బంతుల్లోనే 103 పరుగులు  చేశాడు. 

2016 ప్రపంచకప్ లోనే క్రిస్ గేల్ టీ20  వరల్డ్ కప్ టోర్నీలలో మరో అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లోనే సెంచరీ బాదాడీ యూనివర్సల్ బాస్.

click me!