Workplace Romance: రోజూ కలిసి పని చేయడం, మాట్లాడుకోవడం వల్ల కొలిగ్స్ మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సర్వేలో ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ఫోర్బ్స్ వెల్లడించిన ఒక వర్క్‌ప్లేస్ రొమాన్స్ సర్వే ప్రకారం, 60 శాతానికి పైగా మంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆఫీస్‌లో ప్రేమలో పడ్డట్లు తెలిపారు. అంతేకాదు, సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది ఆఫీసులో ప్రారంభమైన ప్రేమ తర్వాత పెళ్లి వరకు వెళ్లిందని చెప్పారు. దీనితో ఉద్యోగ స్థలాల్లో ప్రేమ సంబంధాలు ఎంత సాధారణమయ్యాయో అర్థమవుతోంది.
25
ఆఫీస్ రొమాన్స్ ఎందుకు పెరుగుతోంది?
ఈ మార్పుకు ప్రధాన కారణం “కంఫర్ట్ జోన్” అని సర్వే చెబుతోంది. దాదాపు 65 శాతం మంది ప్రతిరోజూ కలిసి పని చేయడం వల్ల ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. అలాగే 61 శాతం మంది ఉద్యోగ బిజీ కారణంగా బయట కొత్త వ్యక్తులను కలిసే సమయం దొరకడం లేదని చెప్పారు. ఇక ఒకే వాతావరణంలో పనిచేయడం వల్ల ఆలోచనలు, పనితీరు, ఒత్తిడి వంటి విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీంతో భావోద్వేగ అనుబంధం త్వరగా ఏర్పడుతోంది.
35
సహోద్యోగులతో రిలేషన్ ఎందుకు బలపడుతుంది?
ఆఫీసులో కలిసి పనిచేసే వ్యక్తులు ఒకరి డైలీ రొటీన్, పని ఒత్తిడి, కెరీర్ లక్ష్యాలను మరొకరు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలామందికి సహోద్యోగులతో భావోద్వేగ అనుబంధం త్వరగా ఏర్పడుతుంది. సర్వే ప్రకారం, చాలామంది కేవలం టైమ్‌పాస్ కోసం కాకుండా తమ పని, వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తినే పార్ట్‌నర్‌గా కోరుకుంటున్నారు. అందువల్ల ఆఫీస్‌లో ఏర్పడే సంబంధాలు కొన్నిసార్లు మరింత బలంగా మారుతున్నాయి.
అయితే ఆఫీస్ రొమాన్స్ అన్నది ఎప్పుడూ సాఫీగా సాగుతుందనే హామీ లేదు. సర్వే ప్రకారం, వర్క్‌ప్లేస్ రిలేషన్‌షిప్‌లలో బ్రేకప్ భయం 17 శాతం ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే సంబంధం విరిగిపోతే దాని ప్రభావం వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితంపైనా పడే అవకాశం ఉంటుంది. దాదాపు 54 శాతం మంది తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై కూడా ప్రభావం పడిందని తెలిపారు. సెలవులు ప్లాన్ చేయడం, వ్యక్తిగత జీవితం–ఉద్యోగ జీవితాన్ని వేరుచేయడం కష్టమైందని చాలామంది చెప్పారు.
55
గాసిప్స్, అసూయకు కూడా కారణం
ఆఫీస్ రొమాన్స్ కారణంగా కొన్నిసార్లు గాసిప్స్, అసూయ కూడా పెరుగుతున్నాయని సర్వే వెల్లడించింది. 52 శాతం మంది రిలేషన్ తర్వాత సహోద్యోగుల ప్రవర్తన మారిందని చెప్పారు. అలాగే 50 శాతం మంది ఇలాంటి సంబంధాలు ఆఫీసులో ఫేవరిటిజం పెరగడానికి కారణమవుతాయని భావించారు.అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, చాలామంది తమ సహోద్యోగులతో ఏర్పడిన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అందుకే ఇప్పటికీ చాలా మంది తమ జీవిత భాగస్వామిని మొదటిసారి ఆఫీసులోనే కలుస్తున్నారు.