భార్యాభర్తలు ఏ విషయంలోనైనా అవగాహన కలిగి ఉండడం ఎంత ముఖ్యమో పరస్పరం చర్చించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకరికి తెలియకుండా ఒకరు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ సంసారం కూరుకుపోతుంది. డబ్బు విషయంలో భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త పూర్తి నమ్మకాన్ని సంపాదించుకోవాలి.
నమ్మకం లేని చోట నిజం చెప్పినా అది ఇద్దరి మధ్య విభేదాన్ని సృష్టిస్తుంది కాబట్టి. ఇద్దరూ కూర్చొని ఆర్థిక విషయాలపై పరస్పర అవగాహనతో ఈ సమస్యను అధిగమించవచ్చు. మనకి వస్తున్న రాబడి ఎంత మనం పెడుతున్న ఖర్చు ఏమిటి..
ఏ ఖర్చులన్నీ తగ్గించుకోవాలి అనే విషయాలపై ఇద్దరు ఒక అవగాహనకి వస్తే ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తుంది. ఆర్థిక విషయాలలో ఎప్పుడూ భార్యాభర్తల మధ్యన పారదర్శకత పాటించండి.
డబ్బు విషయంలో భాగస్వామి దగ్గర అబద్ధం చెప్పటం వలన అవతలి వారిని మోసం చేయటమే కాదు మీరు కూడా మోసపోతారు ఎందుకంటే ఆ సంసారం మీది కూడా. అలాగే ప్రణాళికల ప్రకారం కాకుండా ఖర్చులు హెచ్చుతగ్గులైనప్పుడు మీ భాగస్వామికి సరైన సలహా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడం మంచిది.
అలాంటి సామర్థ్యం భార్యాభర్తలిద్దరికీ కరువైనప్పుడు ఆర్థిక సలహాదారుడుని సంప్రదించడం మంచిది. ఒక అవగాహన ప్రకారం నేటి ఖర్చులను కాకుండా భవిష్యత్తు కు ఉపయోగపడే విధంగా డబ్బుని పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి రోజున మన శరీరం డబ్బు సంపాదించడానికి సహకరించకపోవచ్చు.
కాబట్టి డబ్బు విషయంలో ఒకరితో ఒకరు వాదించుకోవటం కన్నా ఒక అవగాహనతో ప్రస్తుత జరుగుబాటితో పాటు భవిష్యత్తులో జరుగుబాటుకి కూడా ప్రణాళికలు వేసుకోండి. ఇలా పరస్పరం చర్చించుకోవడం వలన ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా మీరిద్దరూ ఎంతో దగ్గరవుతారు.