ప్రస్తుతం పిల్లల ప్రపంచం స్క్రీన్‌ల చుట్టూ తిరుగుతోంది. ఫోన్, టీవీ, ట్యాబ్ వంటివి వారికి ఆట వస్తువులుగా మారిపోయాయి. కానీ ఎక్కువ స్క్రీన్ టైమ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? వంటివి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ డిజిటల్ యుగంలో పిల్లలు స్క్రీన్ లేకుండా రోజంతా గడపడం కష్టమైపోయింది. మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ ఇలా ఏదో ఒక రూపంలో స్క్రీన్ పిల్లల జీవితంలో భాగమైపోయింది. చదువు, వినోదం, గేమ్స్, కార్టూన్స్ ఇలా అన్ని విషయాల్లో స్క్రీన్ వాడకం పెరుగుతోంది. కానీ ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే, తల్లిదండ్రులు పిల్లల వయసును బట్టి ఎన్ని గంటలు స్క్రీన్ చూడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
27
0 నుంచి 2 సంవత్సరాల పిల్లలు
0 నుంచి 2 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే నిపుణులు ఈ వయసులో ఉన్న పిల్లలకు స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఈ దశలో పిల్లలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ కళ్లతో, చేతులతో, శబ్దాలతో తెలుసుకుంటారు. స్క్రీన్ ముందర ఎక్కువ సమయం గడిపితే వారి దృష్టి శక్తి, భాషా అభివృద్ధి, సామాజిక సంబంధాలు తగ్గిపోతాయి. కాబట్టి రెండు ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్ లేదా టీవీ చూపించడం పూర్తిగా మానేయడం మంచిది.
37
2 నుంచి 5 సంవత్సరాల పిల్లలు
2 నుంచి 5 ఏళ్ల పిల్లలను కొంతమేర స్క్రీన్ చూడటానికి అనుమతించవచ్చు. కానీ అది రోజుకు ఒక గంటకు మించకూడదు. అదీ కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో చదువు లేదా ఏదైనా స్కిల్ కి సంబంధించిన కంటెంట్ మాత్రమే చూపించాలి. ఉదాహరణకు.. రంగులు, అక్షరాలు, కథలు చెప్పే వీడియోల వంటివి పిల్లల ఆలోచనా శక్తిని పెంచుతాయి. కానీ యాక్షన్ కార్టూన్స్, హింసాత్మక వీడియోలు చూపించకూడదు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు స్క్రీన్ అస్సలు చూపించకూడదు.
6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు.. స్కూల్ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, హోమ్‌వర్క్ కోసం కూడా స్క్రీన్ ఉపయోగిస్తుంటారు. కాబట్టి పూర్తిగా స్క్రీన్ మానేయమనడం సాధ్యం కాదు. కానీ రోజుకు రెండు గంటల లోపు వినోదానికి మాత్రమే స్క్రీన్ అనుమతించాలి. స్కూల్ అవసరాల కోసం ఉపయోగించే స్క్రీన్ టైమ్ వేరుగా పరిగణించవచ్చు. కానీ ఫ్రీ టైమ్‌లో మొబైల్ గేమ్స్, యూట్యూబ్ లేదా టీవీ ఎక్కువ సేపు చూడకుండా కంట్రోల్ చేయాలి.
57
13 నుంచి 18 సంవత్సరాల వారు
13 నుంచి 18 ఏళ్ల వారు ఎక్కువగా సోషల్ మీడియా, గేమింగ్, సినిమాలు లేదా సీరీస్‌లు చూస్తుంటారు. దీన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు కానీ.. నియంత్రణ మాత్రం తప్పనిసరి. నిపుణుల సూచన ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 గంటలకు పరిమితం చేయడం మంచిది. అలాగే, చదువుకు లేదా ప్రాజెక్ట్‌లకు స్క్రీన్ అవసరం అయితే వాటిని సమతుల్యంగా పరిగణించాలి. రాత్రి పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు స్క్రీన్ చూడటం ఆపేలా చూసుకోవాలి.
67
స్క్రీన్ టైమ్ వల్ల ప్రభావాలు
ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల శరీరం చురుకుగా ఉండదు. ఎప్పుడూ కదలకుండా ఉండటం వల్ల ఊబకాయం రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు స్క్రీన్.. పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. వారిలో ఓపిక, ఏకాగ్రత తగ్గిపోవడం, మాట్లాడే అలవాటు తగ్గడం, ఇతరులకు దూరంగా ఉండటం వంటివి జరుగుతాయి. కాబట్టి స్క్రీన్ వాడకాన్ని కచ్చితంగా నియంత్రించాలి.
77
తల్లిదండ్రుల పాత్ర
పిల్లల స్క్రీన్ టైమ్ నియంత్రణలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. తల్లిదండ్రులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి, పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. స్క్రీన్‌కి ప్రత్యామ్నాయంగా బహిరంగ ఆటలు, బుక్స్ చదవడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని మాట్లాడుకోవడం వంటి వాటిని ప్రోత్సహించాలి.