Published : Jul 15, 2025, 11:58 AM ISTUpdated : Jul 15, 2025, 12:13 PM IST
పిల్లలు చిన్న వయసులోనే అధిక బరువున్న పుస్తకాల సంచులు మోయడం అనేది వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలు స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలన్న విషయాన్ని తెలుసుకోండి.
ప్రస్తుత రోజుల్లో బడి పిల్లలు స్కూల్ కి పుస్తకాల సంచులు మోసుకెళ్తున్నారో...బియ్యం బస్తాలు మోసుకొని వెళ్తున్నారో అర్థం కానీ పరిస్థితులు ఉన్నాయి.వారి చిట్టి చిట్టి భుజాల మీద ఏనుగులు మోసే అంతా బరువుని పెడుతుంటే వారు వంగి పోయి నడుస్తున్నారు. ఇది మనకు నిత్యం ఏదోక స్కూల్ దగ్గర కనిపించే దృశ్యాలే.
27
ఎన్నో ఇబ్బందులు
చిన్న వయసులోనే బరువులు ఎక్కువగా మోయడం వల్ల వారు శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో రోజూ 30 కంటే ఎక్కువ పుస్తకాలు మోస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.
37
తీవ్రమైన అనారోగ్య సమస్యలు
పిల్లల సంచుల్లో ఉండే బరువు వల్ల వారిపై పడే ప్రభావం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడ నొప్పులు, వెన్ను బాధలు, అలసటతో పాటు ఎదుగుదలపై దుష్ప్రభావం వంటి సమస్యలు ముందుగా కనిపిస్తాయి. కొందరికి ఎత్తు పెరగకపోవడం, శరీర ఆకృతి సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వంటి ప్రభావాలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే, స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం విద్యార్థి శరీర బరువుతో పోలిస్తే బ్యాగ్ బరువు 10 శాతానికి మించి ఉండకూడదు. కానీ ప్రస్తుతం చాలా స్కూళ్లలో ఈ నియమాలు పాటించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో బ్యాగ్ బరువు కనీసం 7 నుంచి 15 కిలోల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇది పిల్లల భవిష్యత్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాలు చాలానే ఉన్నాయి.
57
పెద్ద వడ్ల బస్తా సైజులో
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 2 తరగతివారి బ్యాగ్ బరువు 1.5 కిలోలు మించకూడదు. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకి 2 నుంచి 3 కిలోలు. 6-7 తరగతులకు 4 కిలోలు, 8-9 తరగతుల వారికి 4.5 కిలోలు, 10వ తరగతివారికి గరిష్ఠంగా 5 కిలోలు మాత్రమే ఉండాలి. అయితే ఈ లెక్కలన్నింటిని చాలా ప్రైవేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయి. ఒక్కొ సబ్జెక్టుకి తక్కువలో తక్కువ వేసుకున్న కనీసం ఐదారు పుస్తకాలు ఉంటున్నాయి.దాంతో పుస్తకాల సంచి పెద్ద వడ్ల బస్తా సైజులో తయారవుతుంది.
67
ఎంత బరువుంటే...అంత ఉత్తమ విద్య
ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం కలిసి చర్యలు తీసుకోవడం అత్యవసరం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సంచి మోసే శక్తి లేక అలసిపోయి ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం స్కూల్‌లో ఎంత బరువైన పుస్తకాలు ఉంటే అంతే ఉత్తమ విద్య పొందుతున్నారనుకునే భ్రమలో బతికేస్తున్నారు. ఇది తప్పు. చదువు మెరుగ్గా ఉండాలంటే బ్యాగ్ బరువు తప్పనిసరిగా తక్కువగా ఉండాలి.
77
నో బ్యాగ్ డే
సాధ్యమైనన్ని పుస్తకాలు స్కూల్‌లోనే ఉంచాలని పాఠశాలలు కూడా ముందుకు రావాలి. ఇంటివద్ద చదువుకునేందుకు మాత్రమే అవసరమైన పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లేలా పిల్లలకు చెప్పాలి. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్‌ను వేరే సంచుల్లో మోయాలని అలవాటు చేయాలి. పిల్లల బ్యాగ్ బరువు అధికంగా ఉంటే తక్షణమే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.
ఇంకా కొన్నిచోట్ల “నో బ్యాగ్ డే” అనే కార్యక్రమాన్ని చేపట్టి వారానికొకరోజు బ్యాగ్ తీసుకురాకుండా పిల్లలకు ఆ రోజంతా సృజనాత్మక, ఆనందకరమైన విద్యను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను అన్ని పాఠశాలలూ పాటిస్తే పిల్లలకు మంచి ఉపశమనం కలుగుతుంది.