
పాలు శరీరానికి ఎంతో శక్తిని ప్రోటీన్లు అందించే ఆహారం. చిన్న పిల్లలకు నిత్యం పాలు తాగిస్తుంటారు. పాల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో, మానసిక శక్తిని మెరుగుపరచడంలో, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో పాల పాత్ర గొప్పది. కానీ, పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత కొందరు తల్లిదండ్రులు చేసే కొన్ని ఆహార సంబంధిత పొరపాట్లు, పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి.
పాలు తాగిన తర్వాత వెంటనే తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి హాని కలిగించేవిగా మారతాయి. ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలు చిన్నవిగా కనిపించినా, పిల్లల ఆరోగ్యాన్ని విపరీతంగా నాశనం చేయోచ్చు. అందుకే, పాలు తాగిన తర్వాత వెంటనే ఇవ్వకూడని ఆహారాల జాబితాను, వాటి వల్ల కలిగే సమస్యల్ని తెలుసుకోవడం అవసరం.
చిరుతిండి అంటే పిల్లలకి చాలా ఇష్టం. వాళ్లకు పాలు తాగించే ముందు లేదా తరువాత కొన్ని తినుబండారాలు ఇస్తుంటారు తల్లిదండ్రులు. కానీ కారం, ఉప్పు కలిగిన చిప్స్, కుర్కురే వంటి వాటిని పాలతో కలిపి తినిపించడం శరీరానికి అంత మంచిది కాదు. ఇవి జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. పిల్లలకి అజీర్ణం, గ్యాస్, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పాలు తాగిన వెంటనే పుల్లని పండ్లు ఇవ్వడం. నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ శాతం అధికంగా ఉంటుంది. పాలలో ఉన్న ప్రోటీన్లతో ఇవి కలిసి జీర్ణక్రియలో అంతరాయం కలిగిస్తాయి. దాంతో కడుపు ఉబ్బరం, వాంతులు, తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పుల్లటి పండ్లు పాల తర్వాత తినడం వల్ల పాలలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు కూడా.
పాలతో ద్రాక్ష కూడా కలిపి తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో విటమిన్ సి, ఫ్రూట్ యాసిడ్ వంటివి పాలలోని ప్రోటీన్లతో కలిసినప్పుడు కడుపునొప్పి, విరేచనాలు వంటి అసౌకర్యాలు కలగవచ్చు. పాలు తాగిన తర్వాత ద్రాక్ష తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ సంగతి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో 90 శాతం పైగా నీటి శాతం ఉంటుంది. పాలు తాగిన వెంటనే పుచ్చకాయ తింటే జీర్ణ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది. నీరు అధికంగా ఉండడం వల్ల పాలు పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. ఇది కడుపు నొప్పి, డయేరియా లాంటి సమస్యలకు దారితీస్తుంది. చిన్నారుల్లో ఇది మరింత అసౌకర్యంగా ఉంటుంది.
నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగడం కూడా చాలా మందిలో కనిపించే అలవాటు. ఇది చిన్నపిల్లలు చేయకూడదనేది నిపుణుల సూచన. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ ఒకటి అయితే, మాంసాహారం జీర్ణమయ్యే విధానం వేరే. ఈ రెండింటి మేళవింపుతో శరీరంలో టాక్సిన్లు ఏర్పడి, చర్మ సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం, లేదా అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ కారణంగా, తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత కనీసం అరగంట పాటు ఇతర ఆహారాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. పాల తర్వాత తినే పదార్థాలు సాఫీగా జీర్ణం అయ్యేలా ఉండాలి. పాలకు వ్యతిరేకంగా పనిచేసే ఆహారాలు జీర్ణ సమస్యలతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా చేయవచ్చు.