కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలని అందరూ మల్లగుల్లాలు పడుతుంటే... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరోనా వేడి కన్నా రాజకీయ వేడి ఎక్కువగా కనబడుతుంది. తాజాగా ఆ రాజకీయ వేడి మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ని తొలిగించడంతో మరోసారి బహిర్గతమైంది.
undefined
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది.
undefined
గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రమేష్ కుమార్ ను తొలగించడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు సంక్రమించిన అధికారాల ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది.
undefined
దానికి పూర్వం కరోనా మహమ్మారి విజృంభిస్తుందనే కారణం మీద రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా సాగిన యుద్ధం మనమందరం చూసాము కూడా.
undefined
ఇక ఉన్నట్టుండి నేటి ఉదయం ఆయనను తొలగిస్తూ జీవోను జారీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అందరూ కూడా అసలు ఈ తొలగింపు చెల్లుతుందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు రాజ్యాంగంలో ఏమి చెప్పారు, కోర్టులో గెలుస్తుందా లేదా తెలుసుకుందాము.
undefined
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(k) ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలం, ఆయన విధి విధానాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారంగానే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పదవి కాలాన్ని నిర్ణయించడంలో రాష్ట్రప్రభుత్వానిదే పూర్తి నిర్ణయాధికారం. కానీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారిని తొలిగించే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆయనను హై కోర్ట్ జడ్జిని తొలిగించినట్టు తొలగించాల్సి ఉంటుంది. అంతే.... ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుది. పార్లమెంటు 23వ వంతు ప్రత్యేక మెజారిటీతో తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని తొలిగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
undefined
ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలాన్ని కుదించడం ద్వారా, రమేష్ కుమార్ పదవి కాలం పూర్తయినట్టుగా చూపెడుతూ ఆయనను తొలిగించారు. ఇప్పుడు ఇది చెల్లుతుందా అనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. సుప్రీమ్ కోర్టు పాత తీర్పులను తీసుకున్న కూడా ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవారి హక్కులను కాలరాసేలా, ప్రయోజనాలకు విరుద్ధంగా వారి సర్వీస్ కండిషన్స్ ని మార్చరాదు అని తెలియవస్తుంది.
undefined
ఇక్కడ జగన్ సర్కార్ చాలా తెలివిగా ఎన్నికల సంస్కరణల్లో(ఎలెక్టోరల్ రిఫార్మ్స్) భాగంగా తటస్థమైన,పక్షపాత వైఖరిని ప్రదర్శించని ఎన్నికల కమీషనర్ కోసం అని చెబుతుంది. రేపు కోర్టులో కూడా ప్రభుత్వం ఇదే వాదన వినిపించనుంది.
undefined
ఇప్పటికే కోర్టుల్లో జగన్ సర్కార్ కు ఎన్నికల వాయిదా విషయంలో, ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో అక్షింతలు పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఎన్నికల మధ్యలో ఆయనను ఎలా తొలిగిస్తారు అనేది మొదటి ప్రశ్న అయితే, ఆయన పక్షపాత వైఖరిపై ఆరోపణలు గనుక చేస్తే, అది ఎలా ప్రూవ్ చేస్తారో చూడాల్సిన అంశం. కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కళ్ళారా చూస్తున్న కోర్టు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించే లాయర్ వాదనలు వినేంతవరకు ఈ కేసుపైన మనం ఏమీ మాట్లాడలేము.
undefined