ఎటూకాని జగన్, చంద్రబాబు, కేసీఆర్, ఒవైసీ.. ఎన్డీయే నుంచి పవన్‌కు పిలుపు..!

First Published | Jul 17, 2023, 1:32 PM IST

దేశంలో ప్రస్తుతం ఓవైపు మరోసారి కేంద్రంలో అధికారంలో రావడమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి సమావేశం, మరోవైపు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా పలు ప్రతిపక్షాలు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

దేశంలో ప్రస్తుతం ఓవైపు మరోసారి కేంద్రంలో అధికారంలో రావడమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి సమావేశం, మరోవైపు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా పలు ప్రతిపక్షాలు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ రెండు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ కీలక పార్టీలకు ఆహ్వానం అందకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌కు, వైఎస్ జగన్‌ నేతృత్వంలోని వైసీపీకి, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి, అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎంకు.. అటు ప్రతిపక్షాల కూటమి నుంచి గానీ, ఇటూ ఎన్డీయే కూటమి నుంచి గానీ పిలుపు అందలేదు. కేవలం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు మాత్రం.. ఎన్డీఏ కూటమి సమావేశానికి పిలుపువచ్చింది. 
 

Latest Videos


అయితే అటు ఎన్డీయే కూటమి గానీ.. ఇటు ప్రతిపక్షాల కూటమి గానీ.. తమకు నమ్మకమైన, అనుకూలమైన పార్టీలను మాత్రమే  సమావేశాలకు ఆహ్వానిస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎంలకు ఆహ్వానాలు అందలేదనే విశ్లేషణలు ఉన్నాయి. 

kcr

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. కేంద్రంలోని  మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పలు ప్రతిపక్షాల పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే  కేసీఆర్ మంతనాలు జరిపిన మెజారిటీ పార్టీలు.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సత్సబంధాలు కలిగిన పార్టీలే. ఇక, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేసీఆర్ విమర్శలను తగ్గించారు. ఈ క్రమంలోనే బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా వ్యవహరిస్తుందని కాంగ్రెస్, ఎన్సీపీ సహా పలు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు లోపాయికారి అవగాహనతోనే కేసీఆర్‌కు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆహ్వానం అందకపోయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు గతంలో ఎన్డీఏలో కీలక భూమిక పోషించారు. 2014 ఎన్నికల్లో కూడా ఎన్డీఏతో కలిసి ముందుకు సాగారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. 2019 ఎన్నికలకు ఏడాది ముందుగానే చంద్రబాబు.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోగా.. అది ఆశించిన స్థాయిలో లబ్ది చేకూర్చలేదు. మరోవైపు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత సాధ్యం కాలేదు. 
 

ఈ పరిణామాల  నేపథ్యంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు.. సైలంట్ అయిపోయారు. ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోవడమే ఆయన ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలకు చంద్రబాబు  దూరంగా జరిగారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో విపక్ష పార్టీలు చంద్రబాబును దూరం పెట్టాయని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అందుకే వారు కూడా ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం పంపలేదని సమాచారం. 
 

వైసీపీ విషయానికి వస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే  పరిమితం చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో వైసీపీతో కొత్త ప్రస్తానం మొదలుపెట్టిన జగన్.. ఏపీ విభజన తర్వాత కొద్ది నెలలకే తన రాజకీయం మొత్తం ఏపీకే పరిమితం చేశారు. అక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన జగన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతను కొనసాగిస్తున్నారు. అందుకు సీఎం జగన్‌పై ఉన్న కేసులే కారణమని ఆయన ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి.

అయితే ప్రతిపక్ష పార్టీల నేతలతో జగన్‌కు సత్సబంధాలు లేవు. కేసీఆర్ కూడా.. మోదీ వ్యతిరేక పోరాటం అని  పలువురు నేతలను కలిసినప్పటికీ తనకు సన్నిహితుడైన జగన్‌ మాత్రం కలవలేదు. మరోవైపు కేంద్రంలోని బీజేపీతో స్నేహపూర్వక వైఖరి ఉన్నప్పటికీ.. ఆయన ఎన్డీఏలో చేరికకు సిద్దంగా లేరని  తెలుస్తోంది. తమకు ఎవరితోనూ పొత్తు ఉండలేదని.. తాము సింగిల్‌గానే వస్తామని  కూడా జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఎంఐఎం విషయాని వస్తే.. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం‌కు హైదరాబాద్‌లోని పాతబస్తీ కంచుకోటగా ఉంది. అయితే పార్టీ విస్తరణ చేపట్టిన ఒవైసీ.. వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ఉప ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలబెడుతున్నారు. అయితే ముస్లిం మైనారిటీ జనాభా ఎక్కువగా  ఉన్న నియోజకవర్గాల్లో ఒవైసీ.. అభ్యర్థులను నిలుపుతున్నారు. అయితే ఇది చాలా చోట్ల పరోక్షంగా బీజేపీకి  సహకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందనే ఆయా పార్టీల నేతలు విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయనకు విపక్ష కూటమి నుంచి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం పరస్పరం భిన్న దృవాలు కావడం.. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండటంతో ఎన్డీఏ నుంచి పిలుపు వచ్చే అవకాశమే లేదు. 
 

click me!