Prohibited Items In Aircraft : విమాన ప్రయాణంలో ఎండు కొబ్బరి, పవర్ బ్యాంకులు సహా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నియమాలు ఎందుకు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పవర్ బ్యాంక్ నుంచి థర్మామీటర్ వరకు.. విమానంలో నిషేధించిన వస్తువుల లిస్ట్ ఇదే
విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు తమ బ్యాగుల్లో ఏ వస్తువులను తీసుకెళ్లవచ్చు, వేటిని తీసుకెళ్లకూడదు అనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది ప్రయాణికులు తెలియక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తెచ్చుకుని ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎండు కొబ్బరి వంటి సాధారణ వస్తువులను కూడా విమానాల్లోకి అనుమతించరు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ, భద్రతా కారణాలను విమానయాన సంస్థలు స్పష్టంగా వివరించాయి. ఆ వివరాలు గమనిస్తే..
26
ఎండు కొబ్బరిపై నిషేధానికి కారణం ఇదే
సాధారణంగా మనం పూజా కార్యక్రమాల కోసం లేదా వంటల కోసం ఎండు కొబ్బరిని వాడుతుంటాం. అయితే, విమాన ప్రయాణంలో దీనిని హ్యాండ్ బ్యాగేజీలో కానీ, చెక్-ఇన్ బ్యాగేజీలో కానీ అనుమతించరు. దీనికి ప్రధాన కారణం ఎండు కొబ్బరిలో ఉండే అధిక నూనె శాతం. ఎండు కొబ్బరి అత్యంత మండే స్వభావం కలిగిన వస్తువు. విమానం ప్రయాణించేటప్పుడు లోపల కలిగే వేడికి లేదా ఇతర కారణాల వల్ల ఎండు కొబ్బరి మంటలను త్వరగా గ్రహించే ప్రమాదం ఉంది. ఇది విమాన భద్రతకు ముప్పు కలిగిస్తుంది కాబట్టి దీనిని నిషేధించారు.
36
బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల పై కూడా నిషేధం
మనం నిత్యం వాడే పవర్ బ్యాంకులు, లిథియం అయాన్ బ్యాటరీలు, విడి బ్యాటరీలపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇవి పాడైపోయినప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు విమానంలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్-ఇన్ బ్యాగేజీలో వేయకూడదు. వీటిని కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే ఉంచుకోవాలి. తద్వారా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఆఫ్ చేయడానికి వీలులేని బ్యాటరీతో నడిచే పరికరాలను కూడా క్యాబిన్ బ్యాగేజీలో అనుమతించరు.
వీల్ చైర్లు, మెర్క్యురీ పరికరాల పై కూడా విమానంలో నిషేధం
బ్యాటరీలతో నడిచే వీల్ చైర్లు, ఇతర మొబిలిటీ సాధనాల విషయంలో జాగ్రత్త వహించాలి. వీటిలో వాడే వెట్ బ్యాటరీల నుండి యాసిడ్ లీక్ అయితే విమాన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని కార్గో విభాగంలో ప్రత్యేక జాగ్రత్తల మధ్య రవాణా చేస్తారు. అదేవిధంగా మెర్క్యురీ ఉండే థర్మామీటర్లు లేదా బారోమీటర్లను కూడా విమానంలో అనుమతించరు. ఒకవేళ ప్రయాణంలో ఇవి పగిలి పాదరసం బయటకు వస్తే, అది విమానంలోని అల్యూమినియం భాగాలను వేగంగా దెబ్బతీస్తుంది. ఇది విమానాన్ని దెబ్బతీస్తుంది.
56
గ్యాస్ సిలిండర్లు, ఈ-సిగరెట్ల పై కూడా ఫ్లైట్ లో నిషేధం
కంప్రెస్డ్ గ్యాస్ కార్ట్రిడ్జ్‌లు, గ్యాస్ సిలిండర్లు, లైటర్లు, ఈ-సిగరెట్లు విమానంలో తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఇవి ఒత్తిడికి గురైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు పేలిపోయే అవకాశం ఉంది. ఈ వస్తువులు మంటలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా వీటిని పూర్తిగా నిషేధించారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఎక్స్ రే స్కాన్ ద్వారా వీటిని నిశితంగా పరిశీలిస్తారు.
66
మారణాయుధాలు, పదునైన వస్తువులు కూడా విమానంలో నిషేధం
కత్తులు, కత్తెరలు, స్విస్ ఆర్మీ నైఫ్స్ వంటి పదునైన వస్తువులను క్యాబిన్ బ్యాగేజీలో అనుమతించరు. అలాగే పిల్లలు ఆడుకునే డమ్మీ తుపాకులు, కొరడాలు, నన్-చాకులు లేదా స్టన్ గన్‌లు వంటి ఏ రకమైన ఆయుధాలను కూడా విమానం లోపలికి తీసుకెళ్లకూడదు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లోని గైడ్‌లైన్స్‌ను తనిఖీ చేసుకోవడం ఉత్తమం. నిబంధనలను పాటించడం ద్వారా విమాన ప్రయాణం సురక్షితంగా, సులభంగా సాగుతుంది.