
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Central Pay Commission) పక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో, నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్) జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కీలక అడుగు వేసింది. జీతాలు, పెన్షన్లు, ఉపాధికి సంబంధించి 8వ వేతన సంఘం జారీ చేసిన 18 ప్రశ్నల ప్రశ్నావళిపై NC-JCM తన అభ్యంతరాలను, పలు ప్రతిపాదనలను తెలిపింది.
ఏప్రిల్ 1న నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా, 8వ వేతన సంఘం మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మొత్తం 9 ప్రధాన ఆందోళనలను ప్రస్తావించారు. ఉద్యోగుల సంయుక్త మెమోరాండం సమర్పించే ముందు ఈ మార్పులు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన పెన్షనర్ల పాత్రను, వారి ఆర్థిక భద్రతను తక్కువ అంచనా వేయలేమని NC-JCM పేర్కొంది. ప్రస్తుత ప్రశ్నావళిలో పెన్షనర్ల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కోరింది. ముఖ్యంగా పెన్షన్ రివిజన్, పెన్షన్లలో సమానత్వం, కమ్యూటెడ్ పెన్షన్ విలువ పునరుద్ధరణ, పెన్షనర్ల సంక్షేమ చర్యల కోసం ప్రత్యేక నిబంధనలను చేర్చాలని డిమాండ్ చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), కొత్తగా ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలకు వ్యతిరేకంగా ఉన్నారని, పెన్షన్ రూల్స్ 1972 (ప్రస్తుతం 2021) ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని బలంగా కోరుతున్నారు. దీనిపై అభిప్రాయాలను సేకరించేందుకు ప్రశ్నావళిలో అవకాశం కల్పించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించాలని NC-JCM కోరింది. వారి భద్రత, ప్రసూతి ప్రయోజనాలు, నెలసరి సంక్షేమం, చైల్డ్ కేర్ లీవ్ సమస్యలు, పని ప్రదేశంలో సమానత్వం వంటి అంశాలపై చర్చించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. మహిళా ఉద్యోగుల అవసరాలను గుర్తించడం ద్వారా మరింత సమగ్రమైన పాలసీని రూపొందించవచ్చని అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే వివిధ విభాగాలకు భిన్నమైన సవాళ్లు, క్యాడర్ సమస్యలు ఉంటాయని NC-JCM తెలిపింది. అందుకే విభాగాల వారీగా సమస్యలను నివేదించడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు, ఫెడరేషన్లతో చర్చలు జరపడానికి సమయం పడుతుందని, కాబట్టి ప్రత్యేక మెమోరాండం సమర్పించడానికి గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని అభ్యర్థించింది.
ప్రస్తుతం ఆన్‌లైన్ సబ్మిషన్ కోసం ఉన్న 3500 క్యారెక్టర్ల (సుమారు 500 పదాలు) పరిమితి చాలా తక్కువ అని ఉద్యోగ సంఘం పేర్కొంది. సంక్లిష్టమైన అంశాలను వివరించడానికి కనీసం 1000 పదాల పరిమితి ఉండాలని కోరింది. అలాగే, అటాచ్‌మెంట్ ఫైల్ సైజును 2 MB నుండి 10 MBకి పెంచాలని డిమాండ్ చేసింది. కేవలం ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ఈ మెయిల్, హార్డ్ కాపీల ద్వారా కూడా వినతులు సమర్పించే అవకాశం కల్పించాలని, దీనివల్ల సాంకేతిక ఇబ్బందులు తొలగి అందరికీ అందుబాటులో ఉంటుందని లేఖలో వివరించారు.
పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. దీనిలోని ముఖ్య అంశాలు గమనిస్తే..
• స్థిరమైన ఆదాయం: రిటైర్మెంట్ సమయంలో తీసుకున్న చివరి జీతంలో 50% పెన్షన్‌గా వస్తుంది. ఇది మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జీవితాంతం హామీతో కూడిన ఆదాయాన్ని ఇస్తుంది.
• కాంట్రిబ్యూషన్ లేదు: OPS కోసం ఉద్యోగి తన జీతం నుండి ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా NPS లో ఉద్యోగి 10% వాటా చెల్లించాలి.
• కుటుంబ రక్షణ: ఉద్యోగి మరణానంతరం భార్య/భర్తకు ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.
• డీఏ పెంపు: ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా రెండుసార్లు డీఏ పెరుగుతుంది, దీనివల్ల పెన్షన్ మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది.
• గ్రాట్యుటీ & కమ్యుటేషన్: పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
మొత్తంగా చెప్పాలంటే, రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన, రిస్క్ లేని జీవితం కోసం ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ ను బెస్ట్ గా భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.