భజన్ క్లబ్బింగ్ : జెన్-జీ కొత్త ట్రెండ్.. పబ్బులు కాదు, ఇక భక్తి వైబ్స్ !
సాధారణంగా వీకెండ్ పార్టీ లేదా నైట్ లైఫ్ అనగానే మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం.. దద్దరిల్లిపోయే సౌండ్ సిస్టమ్, మిరుమిట్లు గొలిపే లైట్లు, చేతిలో మందు గ్లాసులు, సిగరెట్ పొగలు. కానీ, ఇప్పుడు ఆ సీన్ మారుతోంది. నేటి యువత (Gen Z) ఈ మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ సరికొత్త విప్లవానికి తెరలేపింది. అదే భజన్ క్లబ్బింగ్ (Bhajan Clubbing).
డీజే సౌండ్స్‌కి భక్తిని జోడించి మైమరచిపోయే ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మార్పును గమనించి ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఏంటీ భజన్ క్లబ్బింగ్? యువత ఎందుకు దీని వైపు ఆకర్షితులవుతున్నారు?
అసలేంటీ ఈ భజన్ క్లబ్బింగ్?
సాంప్రదాయ భజన కార్యక్రమాలకు, ఆధునిక క్లబ్ సంస్కృతికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సమ్మేళనమే ఈ భజన్ క్లబ్బింగ్. ఇందులో భక్తి పాటలు, కీర్తనలు, శ్లోకాలను ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్, టెక్నో బీట్స్, లైవ్ బ్యాండ్‌లతో మిక్స్ చేసి వినిపిస్తారు. స్టేజ్ అలంకరణ అచ్చం ఒక హై-ఎండ్ నైట్ క్లబ్‌ను తలపిస్తుంది. లేజర్ లైట్లు, పొగలు గక్కుతున్న స్టేజ్, భారీ స్క్రీన్లు ఉంటాయి.
కానీ అక్కడ వినిపించేవి సినిమా పాటలు కాదు.. హనుమాన్ చాలీసా, అచ్యుతం కేశవం, హరే కృష్ణ హరే రామ వంటి భక్తి గీతాలు. ఇక్కడ యువత నేలమీద కూర్చొని ధ్యానం చేస్తారు లేదా లేచి ఆనందంగా నాట్యం చేస్తారు. ముఖ్యంగా ఇందులో లిక్కర్, ధూమపానం వంటివాటిని పూర్తిగా నిషేధించి, కేవలం భక్తి అనే మత్తులో తేలియాడేలా దీనిని డిజైన్ చేశారు.