
భారతదేశంలో మహిళల భద్రతపై నేషనల్ యానువల్ రిపోర్ట్ ఆండ్ ఇండెక్స్ (NARI) 2025 ఆసక్తికర విషయాలు బైటపెట్టింది. దేశంలో మహిళలకు సురక్షితంగా భావిస్తున్న నగరాలేవి... అభద్రతా భావంతో జీవిస్తున్న నగరాలేవో బైటపెట్టింది. ఇందులో మన తెలుగు రాష్ట్రానికి చెందిన నగరం టాప్ లో నిలిచింది... అంటే ఇక్కడి మహిళలు చాలా సురక్షితంగా ఉంటున్నారన్నమాట.
NARI 2025 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం మహిళల భద్రతలో టాప్ లో నిలిచింది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గాంగ్‌టక్, ఇటానగర్ నగరాలు దేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాలుగా నిలిచాయి. ఇక పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు మహిళల భద్రతలో చివరి స్థానాల్లో ఉన్నాయి... అంటే ఈ నగరాలో మహిళల భద్రత ఆందోళనకరంగా ఉందన్నమాట.
దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గురువారం దీన్ని విడుదలచేశారు. మొత్తంగా జాతీయస్థాయిలో 65 శాతం మహిళా భద్రతా స్కోరు నమోదయ్యింది. సర్వే చేసిన నగరాలను మహిళల భద్రత ఆధారంగా అత్యంత భద్రత, భద్రత, మధ్యస్థం, భద్రతలేమి, అత్యంత భద్రతలేమి కేటగిరీలుగా విభజించారు.
విశాఖపట్నం, కోహిమా వంటి నగరాల్లో లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం, పోలీసు సహాయం, మహిళల కోసం మౌలిక సదుపాయాల వంటి ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. మరోవైపు కోల్‌కతా, పాట్నా, జైపూర్ వంటి నగరాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది... ఇక్కడ కట్టుబాటు, పితృస్వామ్య నియమాలు ఉన్నాయి... మహిళలకు కల్పించే మౌలిక సదుపాయాల్లో లోపాలు ఉన్నాయి.
కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గాంగ్‌టక్, ఇటానగర్, ముంబైలు జాతీయ భద్రతా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి, రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పాట్నా, జైపూర్‌లు తక్కువ స్కోర్‌ను సాధించాయి.
మొత్తంమీద సర్వేలో పాల్గొన్న ప్రతి పది మంది మహిళల్లో ఆరుగురు తమ నగరం సురక్షితమని భావిస్తున్నారు... కానీ 40 శాతం మంది తాము అంత సురక్షితంగా లేమని లేదా అసురక్షితమని భావిస్తున్నారు. రాత్రిపూట ముఖ్యంగా ప్రజా రవాణా, వినోద ప్రదేశాలలో భద్రత తీవ్రంగా తగ్గిందని పరిశోధనలో తేలింది. విద్యా సంస్థలు 86 శాతం సురక్షితం... కానీ రాత్రిపూట లేదా క్యాంపస్ వెలుపల భద్రత భావన తీవ్రంగా తగ్గింది.
దాదాపు 91 శాతం మంది మహిళలకు భద్రత గురించి అవగాహన ఉంది.. కానీ దాదాపు సగం మందికి తమ కార్యాలయాల్లో POSH (లైంగిక వేధింపుల నిరోధక) విధానం ఉందో లేదో స్పష్టంగా తెలియదు. చాలామంది మహిళలు తమ భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులపైనే విశ్వాసం ఉంచారు. 69 శాతం మంది ప్రస్తుత భద్రతా ప్రయత్నాలు కొంతవరకు సరిపోతాయని చెప్పారు, 30 శాతం కంటే ఎక్కువ మంది గణనీయమైన లోపాలు లేదా వైఫల్యాలను పేర్కొన్నారు.
2024లో ఏడు శాతం మంది మహిళలు తాము బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైనట్లు చెప్పారు… ఇది ఇప్పుడు 24 ఏళ్లలోపు వారిలో రెట్టింపు అయి 14 శాతానికి చేరుకుంది. పరిసర ప్రాంతాలు (38 శాతం), ప్రజా రవాణా (29 శాతం) తరచుగా మహిళల వేధింపుల హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడ్డాయి. అయినప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒక బాధితురాలు మాత్రమే ఈ సంఘటనలను బైటపెట్టడానికి ముందుకు వస్తున్నారని ఈ సర్వే తేల్చింది.
ప్రభుత్వ నేర గణాంకాలు మాత్రమే మహిళల వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించలేవని నివేదిక నొక్కి చెప్పింది. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ నివేదికను విడుదల చేస్తూ మహిళల భద్రతను కేవలం చట్టం,వ్యవస్థ సమస్యగా చూడకూడదన్నారు. ఒక మహిళ జీవితంలోని భద్రత అనేది అనేక అంశాన్ని ప్రభావితం చేస్తుంది... అది ఆమె విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు, స్వేచ్ఛను కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నారు.
మహిళలు అసురక్షితంగా భావిస్తే వారు తమను తాము పరిమితం చేసుకుంటారు... దీనివల్ల వారి స్వంత అభివృద్ధి మాత్రమే కాదు దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుందని విజయ రహత్కర్ చెప్పారు. NARI సూచికను నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ నిర్వహించాయి.. దీనిని గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ అకాడెమిషియన్స్ (GIA) ప్రచురించింది.