
ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ షా రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.3,383 కోట్లకు పైగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాంటి వ్యక్తి ఒక్కరోజు భిక్షాటన చేస్తూ కనిపించడంతో దీనికి కారణమేంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది.
పరాగ్ షా భిక్షగాడిగా మారడానికి వెనుక ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఆయన చేపట్టిన కార్యక్రమం. జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు ఈ అనుభవాన్ని పొందాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. సంపద, హోదా, అధికారంతో సంబంధం లేకుండా ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమే దీని ఉద్దేశంగా చెప్పవచ్చు. అందుకే తన భద్రతా సిబ్బందిని కూడా వెంట తీసుకెళ్లకుండా, సాధారణ వ్యక్తిగా జనంలో కలిసిపోయారు. ఎవరూ తనను గుర్తించకుండా ప్రత్యేకంగా రూపాన్ని మార్చుకుని ఘాట్‌కోపర్ ప్రాంతంలోని వీధుల్లో సంచరించారు.
ఈ అనుభవంలో తనను ఎక్కువగా కదిలించిన సంఘటనల్లో ఒకదాన్ని పరాగ్ షా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఓ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి భోజనం చేయమని చెప్పినట్లు తెలిపారు. ఆ డబ్బులు తీసుకుని సమోసాలు విక్రయించే వ్యక్తి వద్దకు వెళ్లారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆ వ్యాపారి ఎలాంటి అసహనం చూపకుండా సమోసాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు.
సమోసాలు అమ్మే వ్యక్తి కూడా ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, తనకు సహాయం చేయడానికి ముందుకు రావడం పరాగ్ షాను ఆకట్టుకుంది. ముంబయి ప్రజల్లో ఇతరులకు సాయం చేసే మనస్తత్వాన్ని ఈ సంఘటన ద్వారా ప్రత్యక్షంగా చూశానని ఆయన పేర్కొన్నారు.
భిక్షగాడి రూపంలో తాను కలిసిన వ్యక్తులే తనకు ఆ రోజు ఆహారం, సహాయం అందించారని చెప్పారు. దీక్ష పూర్తయిన తర్వాత తన రూపాన్ని మార్చి మేకప్‌ను తొలగించుకుని, గతంలో తనకు సహాయం చేసిన కొందరిని మళ్లీ కలిశారు. వారితో మాట్లాడి తన అనుభవాన్ని వివరించి కృతజ్ఞతలు తెలిపారు.
దీని ద్వారా తనకు జీవితాన్ని చూసే విధానం మారిందని పరాగ్ షా తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలు తనను కలవడానికి వస్తారని, ఆ సమయంలో తనకు లభించే గౌరవం, మర్యాదలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. అదే వ్యక్తుల వద్దకు తాను ఒక సాధారణ బిచ్చగాడి రూపంలో వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని వివరించారు.
తన హోదా, ఆస్తులు, రాజకీయ స్థానం ఏవీ తెలియని సమయంలో ప్రజలు తనను కేవలం సహాయం అవసరమైన వ్యక్తిగానే చూశారని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తి విలువను మనం చూసే దృష్టికోణం ఎంత ప్రభావితం చేస్తుందో ఈ అనుభవం తనకు అర్థమయ్యేలా చేసిందన్నారు.
ప్రజల నుంచి వచ్చే గౌరవం శాశ్వతం కాదని, పరిస్థితులు మారితే మనిషిని చూసే విధానం కూడా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు లభించిన ఈ అనుభవాన్ని జీవితంలో మరిచిపోలేనిదిగా ఆయన అభివర్ణించారు.
పరాగ్ షా భిక్షగాడి వేషంలో కనిపించడంతో కొందరికి తెలుగు సినిమా ‘బిచ్చగాడు’ కథ గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో సంపన్నుడైన అరుల్ తన తల్లి ఆరోగ్యం కోసం ఒక స్వామీజీ సూచన మేరకు నిర్దిష్ట కాలం ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా జీవిస్తాడు. ఆ సమయంలో ఎదురయ్యే కష్టాలను అనుభవిస్తూ సాధారణ ప్రజల జీవితాన్ని దగ్గరగా చూస్తాడు.
ముంబయిలో జరిగిన పరాగ్ షా ఘటన కూడా పైకి చూస్తే ఆ సినిమా సన్నివేశాన్ని తలపించినప్పటికీ, ఆయన చేపట్టిన కార్యక్రమానికి సినిమా కథతో సంబంధం లేదు. జైన సంప్రదాయంలోని ఆధ్యాత్మిక సాధనలో భాగంగానే ఒకరోజు ఈ అనుభవాన్ని పొందినట్లు ఆయన వెల్లడించారు. తన ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వంలో దీనిని చేపట్టినట్లు స్పష్టం చేశారు.
भाजपा विधायक प्राग शाह भिखारी के रूप में सड़क किनारे बैठे और लोगों के बीच घूमते नजर आए ,,,
वीडियो में मुंबई के घाटकोपर पूर्व विधानसभा क्षेत्र के विधायक पराग शाह भिखारी के वेश में देखकर हर कोई हैरान रह गया कि आखिर करोड़ों की संपत्ति वाले विधायक ने भिखारी का रूप क्यों धारण किया?… pic.twitter.com/gFNX9nPKmx— TANVIR RANGREZ (@virjust18) September 14, 2026
రియల్ ఎస్టేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పరాగ్ షా తొలుత కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, అనంతరం ఘాట్‌కోపర్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడంతో ఆయన దేశవ్యాప్తంగా కూడా వార్తల్లో నిలిచారు.
అలాంటి సంపన్న ప్రజాప్రతినిధి ఎలాంటి ఆడంబరం లేకుండా ఒకరోజు వీధుల్లో భిక్షాటన చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే పరాగ్ షా దృష్టిలో ఇది ప్రచారం కోసం చేసిన కార్యక్రమం కాదని, తన జీవితాన్ని మరో కోణంలో అర్థం చేసుకునే ఆధ్యాత్మిక అనుభవమని ఆయన చెప్పుకొచ్చారు.
ఒకరోజు సాధారణ భిక్షగాడిగా జీవించడం ద్వారా ప్రజల దయ, ఆహారం విలువ, గౌరవం వెనుక ఉన్న సామాజిక దృష్టికోణం వంటి అంశాలను దగ్గరగా తెలుసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా తనకు తెలియని వ్యక్తులు సైతం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఆహారం, డబ్బు అందించడం మానవత్వంపై తన నమ్మకాన్ని మరింత పెంచిందని పరాగ్ షా వెల్లడించారు.