Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. మూసీ వరదలతో హైదరాబాద్ అప్రమత్తం
తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో సుమారు 35 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు మునిగిపోయాయి.
ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరదనీరు చేరడంతో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి జిల్లాల బస్సులు నడుస్తున్నాయి. పూరానాపూల్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై నీరు పొంగిపొర్లడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. టీఎస్ఆర్టీసీ ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ, వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించమని సూచించింది.