ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీవీఎన్ మాధవ్ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా పాలన అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో నిండిపోయిందని విమర్శించారు.
అలాగే, ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’’ నినాదంతో దేశం ముందుకు వెళ్తుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడం, సాగర్‌మాలలో 14 పోర్టులు, కొత్త విద్యా సంస్థలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, వందే భారత్ రైళ్లను తీసుకురావడం వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నడ్డా తెలిపారు.