
భారతదేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్ విస్తరణలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ ప్రాజెక్ట్ అమలు దశలో ఉండగా, ఇప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్–చెన్నై మార్గంలో దక్షిణ భారతదేశపు తొలి బుల్లెట్ రైలు కారిడార్ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభమైంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి రైలులో ప్రయాణం చేయాలంటే దాదాపు 12 గంటలు పడుతుంది. బుల్లెట్ రైలు పూర్తయితే ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గుతుంది. ఇది ప్రయాణికులకే కాకుండా వ్యాపారాలు, పరిశ్రమలకు కూడా వేగవంతమైన రవాణా అవకాశాలను కల్పిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ RITES సాధ్యాసాధ్యాల అధ్యయనం చేస్తోంది. ఇందులో డిమాండ్ అంచనాలు, ట్రాఫిక్ విశ్లేషణ, సాంకేతిక అంశాలపై పరిశీలన జరుగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్టును RITES సమర్పించనుంది. దీనిపైనే నిర్మాణ వ్యూహం ఖరారవుతుంది. అంటే త్వరలోనే హైదరాబాద్, చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ రావచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు, నియామకాలు జరిగాయి. రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేసి 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఇందులో 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీలు చేశారు. అదనంగా, 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఎస్పీలను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కడప – నచికేత్
గుంటూరు – వకుల్ జిందాల్
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – రాహుల్ మీనా
బాపట్ల – ఉమామహేశ్వర్
పల్నాడు – డి. కృష్ణారావు
ప్రకాశం – హర్షవర్ధన్ రాజు
కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
నెల్లూరు – అజితా వేజెండ్ల
తిరుపతి – సుబ్బరాయుడు
అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
నంద్యాల – సునీల్ షెరాన్
విజయనగరం – ఏఆర్ దామోదర్
ప్రస్తుతం ఏ వేడుక అయినా బాణాసంచా కాల్చడం సాధారణంగా మారింది. పండుగలు నుంచి పుట్టినరోజులు, పెళ్లిళ్లు, రాజకీయ ర్యాలీలు, క్రికెట్ విజయాలు, సినిమా రిలీజ్‌లు… ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టపాసులు పేలుస్తున్నారు. దీని కారణంగా గాలి కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బాణాసంచా వినియోగంపై పిటిషన్లపై విచారణ జరుపుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. డిల్లీలో వాయుకాలుష్యం అధికమైందనే కారణంగా అక్కడ నిషేధం విధించాలని వాదనలు వినిపించాయి. దీనిపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తింది. “కేవలం డిల్లీ ప్రజలకే స్వచ్ఛమైన గాలి అవసరమా? దేశ ప్రజలందరికి అర్హత లేదా?” అని కోర్టు ప్రశ్నించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శుభ్రమైన గాలి పీల్చుకునే హక్కు కలిగినవారేనని కోర్టు స్పష్టంచేసింది. కేవలం డిల్లీలోనే కాదు దేశమంతటా నిషేధం విధిస్తామంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.
ఇటీవలి కాలంలో భారత పొరుగు దేశాలు రాజకీయ అస్థిరతకు కేంద్రంగా మారాయి. ఆర్థిక సంక్షోభాలు, ప్రజా తిరుగుబాట్లు అక్కడి పాలనను కుదిపేశాయి. 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చి అధ్యక్షుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. 2024లో బంగ్లాదేశ్‌లో హింసాత్మక తిరుగుబాటుతో షేక్ హసీనా పదవి కోల్పోయారు.
తాజాగా 2025లో నేపాల్‌లో నిరసనల మధ్య కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ మూడు సంఘటనలు ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.. భారత్ చుట్టూ రాజకీయ అస్థిరత పెరుగుతోంది. ముఖ్యంగా నేపాల్‌లోని తాజా పరిణామాలు కేవలం అంతర్గత సమస్యగా చూడలేము. ఇవి దక్షిణాసియా భౌగోళిక రాజకీయ సమీకరణాలపై, భారత భద్రతా ప్రయోజనాలపై, వాణిజ్య మార్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే పరిణామాలుగా నిలుస్తాయి.
పూర్తి స్టోరీని ఇక్కడ చదవండి 👉 బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.. భారత్ చుట్టూ ఎందుకీ అస్థిరత?
ఆసియా కప్ 2025లో బిగ్ మ్యాచ్ భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం ( సెప్టెంబర్ 14, 2025న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత్ లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీLIV యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పాకిస్తాన్‌లో PTV Sports, Tamasha యాప్ ద్వారా ప్రసారం జరగనుంది. యూకేలో TNT Sports 1, Discovery+, అమెరికా–కెనడాలో Willow TV, MENA ప్రాంతంలో CricLife MAX, STARZPLAY, ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌లో YuppTV లో చూడవచ్చు.
భారత్ ఇప్పటివరకు ఆసియా కప్‌ను ఎనిమిది సార్లు గెలుచుకుంది. ఈసారి సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. పాకిస్తాన్ జట్టును సల్మాన్ ఆఘా నడిపిస్తున్నాడు. చరిత్రలో భారత్ 19లో 10 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. సెప్టెంబర్ 14 పోరు క్రికెట్ అభిమానులకు పండుగగా మారనుంది.