Rahul Gandhi: అట్టుడుకుతున్న ఢిల్లీ.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్

Published : Jul 21, 2026, 09:08 PM IST

Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాజకీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ, విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టింది.

PREV
15
ప్రధాని నివాసం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగారు. కొంతసేపు అక్కడే బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

25
రాహుల్ గాంధీ సహా అగ్రనేతల అరెస్ట్

నిరసన కొనసాగుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించగా, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నాయకులను కూడా అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీసు వాహనాల్లో తరలించారు. ఈ ఘటనతో ప్రధాని నివాసం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

35
కాంగ్రెస్ పెట్టిన ఐదు ప్రధాన డిమాండ్లు

నిరసన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందుకు ఐదు కీలక డిమాండ్లు ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చ నిర్వహించాలని, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అధికారిక ప్రకటన చేయాలని కోరింది. అలాగే పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.

45
ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు

నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యువత సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిపై బలప్రయోగానికి దిగుతోందని ఆరోపించారు. దేశ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు.

55
అరెస్టులపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

రాహుల్ గాంధీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ, శాంతియుత నిరసన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. విద్యార్థుల సమస్యలకు మద్ధతు తెలిపిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన చెప్పారు. విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories