
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమీబియా దేశం అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరబిలిస్’ ను అందజేసింది. నమీబియా అధ్యక్షురాలు డా. నెటుంబో నాందీ-ఎండైట్‌వా చేతుల మీదుగా ఈ సత్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని 1995లో నమీబియా స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని అత్యున్నత పౌర గౌరవంగా పరిగణిస్తారు.
ఈ పురస్కారానికి పేరుగా ఉన్న ‘వెల్విచియా మిరబిలిస్’ ఒక అరుదైన, చారిత్రత్మకమైన మొక్క. ఇది నమీబియా ఎడారుల్లో మాత్రమే కనిపించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. దీని దీర్ఘాయువు, ధైర్యం, సహనం లక్షణాలుగా ఉండటమే ఈ అవార్డు వెనుక ఉన్న గొప్పతనాన్ని, స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
ఈ అవార్డుతో పాటు, ప్రధాని మోడీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వివిధ దేశాల ప్రధానులతో సుదీర్ఘ దౌత్య సంబంధాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం వంటి వాటికి గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి.
బ్రెజిల్ దేశం ఇచ్చిన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్’ తర్వాత ఇది మోడీకి లభించిన మరో గొప్ప గౌరవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, “నమీబియాకు చెందిన అత్యున్నత పౌర పురస్కారం లభించడం నాకు గౌరవంగా ఉంది. ఈ అవార్డును 140 కోట్ల భారతీయుల తరఫున స్వీకరిస్తున్నాను” అని తెలిపారు.
నమీబియా రాజధాని విండ్హోక్‌లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం, భారత్-నమీబియా మధ్య నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఇవి ప్రధానంగా ఆరోగ్యం, ఔషధాలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనాలు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించేందుకు దోహదపడతాయి.
ముఖ్య ఒప్పందాలు:
• నమీబియాలో వ్యవస్థాపకత అభివృద్ధి కేంద్రం (Entrepreneurship Development Center) ఏర్పాటు చేయడం
• ఆరోగ్య రంగంలో సహకారం
• నామీబియా సీడీఆర్ఐ (CDRI)లో చేరికకు అంగీకార పత్రం
• గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో సభ్యత్వానికి అంగీకారం
ప్రధాని మోడీ నమీబియాను తొలిసారి సందర్శించారు. గత 30 సంవత్సరాల్లో ఇది మూడవసారి భారత ప్రధానమంత్రి నమీబియా సందర్శించిన సందర్భం కావడం విశేషం. ఆయన బ్రెజిల్ నుండి తన ఐదు దేశాల పర్యటన చివరి దశలో నమీబియాకు చేరుకున్నారు.
విండ్హోక్ చేరుకున్న వెంటనే మోడీ జాతీయ స్మారక స్థలమైన ‘హీరోస్ ఎకర్’ వద్ద నమీబియా స్వాతంత్య్ర పోరాట నేత, మాజీ రాష్ట్రపతి సామ్ నుజోమాకు నివాళులు అర్పించారు.
నమీబియా అధ్యక్షురాలితో మోడీ నిర్వహించిన చర్చలలో డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఖనిజాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మోడీ ట్విట్టర్ (X) వేదికగా పేర్కొంటూ, "ఆర్థిక సంబంధాలు, ఇంధనం, పెట్రోరసాయనాల రంగాల్లో సహకారం పెంచే దిశగా చర్చించాం. ప్రాజెక్ట్ చీతా విషయంలో నమీబియా ఇచ్చిన సహకారం పట్ల కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.
పీఎం మోడీకి నమీబియా స్టేట్ హౌస్ వద్ద సాంప్రదాయ ఘనస్వాగతం, గౌరవ వందనం లభించింది. ఈ పర్యటన భారత-ఆఫ్రికా సంబంధాల్లో మరింత నూతన యుగాన్ని ప్రారంభించే అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది భారత్-నమీబియా ద్వైపాక్షిక సంబంధాల్లో మరొక కీలక మైలురాయిగా నిలిచిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.