PM Modi: మహిళా రిజర్వేషన్ల అమలుపై మోదీ కీలక వ్యాఖ్యలు.. త‌గ్గేదే లేదంటూ

Published : Nov 28, 2026, 03:46 PM IST

PM Modi: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తామని భరోసా ఇచ్చారు.

PREV
15
మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం

మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ లక్ష్యం సాధించేందుకు తాను కూడా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. మహిళలు తమ సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చారని, చాలామంది లేఖల ద్వారా తమ ఆకాంక్షలను తెలియజేశారని చెప్పారు. దేశంలోని మహిళల ఆశీర్వాదం తమకు ఉందని పేర్కొంటూ, వారికి ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతామని వెల్లడించారు.

25
ప్రతిపక్షాల వల్ల మహిళా ప్రాతినిధ్యం ఆగదు

మహిళా రిజర్వేషన్ల అమలుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ సంకల్పం బలంగా ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే మార్పును కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు విజయవంతం కావని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

35
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఆసక్తి

మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన తదుపరి చర్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. నవంబర్ 30 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు లోక్‌సభ సమావేశం కాగా, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానుంది. ప్రభుత్వ నిర్ణయించిన కార్యక్రమాల ప్రకారం డిసెంబర్ 3 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ చర్చలు కూడా వేడెక్కాయి.

45
లోక్‌సభ సీట్లు 850కి పెంచే ప్రతిపాదన

మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్రం కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించిన లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర శాసనసభల్లోనూ ఇదే విధమైన పెంపును ప్రతిపాదించింది. ఈ మేరకు తీసుకొచ్చే రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026 ద్వారా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను ప్రస్తుత 550 పరిమితి నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల గరిష్ఠ సంఖ్యను 500 నుంచి 650కి పెంచే అంశాన్ని కూడా చేర్చారు. సవరించిన సీట్ల కేటాయింపులు, నియోజకవర్గాల సరిహద్దులను 2051 వరకు స్థిరంగా ఉంచే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది.

55
బిల్లుకు మద్దతుపై కేంద్రం ధీమా

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలకు పార్లమెంట్‌లో తగిన మద్దతు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. గతంలో ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొన్ని ప్రాంతీయ పార్టీలు తాజాగా తమ వైఖరిలో మార్పు చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఒకే నిష్పత్తిలో పెంచే ప్రతిపాదన ఈ మార్పున‌కు కారణంగా భావిస్తున్నారు. మొత్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశాలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్రత్యేక సమావేశాల్లో బిల్లులపై జరిగే చర్చ, వాటికి లభించే మద్దతు తదుపరి రాజకీయ పరిణామాలను నిర్ణయించనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories