PM Modi: ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వెలుపల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వేళ, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధానమంత్రి మోదీతో జరిగిన సమావేశంలో శరద్ పవార్ దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. సమావేశంలో ఇరువురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు, కొన్ని అంశాలపై చర్చించినట్లు ఫోటోలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని స్వయంగా శరద్ పవార్‌కు స్వాగతం పలకడం కూడా చర్చనీయాంశమైంది.
23
డీలిమిటేషన్ బిల్లుపై మద్ధతు చర్చ?
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్‌లో రెండు మూడవ వంతు మద్ధతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)కు చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్ధతు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అన్ని నియోజకవర్గాల్లో 50 శాతం సీట్ల పెంపుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే బిల్లుపై చర్చకు సిద్ధమని ఇటీవల సుప్రియా సూలే స్పష్టం చేశారు.
Rajya Sabha MP Shri @PawarSpeaks Ji and Lok Sabha MP Smt. @supriya_sule Ji called on PM @narendramodi in Parliament earlier today. pic.twitter.com/DwTspUA0th
— PMO India (@PMOIndia) July 22, 2026
33
ఎన్‌డీఏలో చేరికపై ఊహాగానాలు
శరద్ పవార్ వర్గం ఎన్‌డీఏకు సపోర్ట్ ఇచ్చే అవకాశాలపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం అధికారికంగా ఎన్‌డీఏలో చేరాలంటే ముందుగా ఎన్సీపీలోని రెండు ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ఒక్కటై విలీనం కావాల్సి ఉంటుందని పార్టీ అభిప్రాయపడుతోంది. అలాంటి పరిస్థితి లేకుండా వ్యక్తిగతంగా శరద్ పవార్ లేదా ఆయన అనుచరులను కూటమిలో చేర్చుకునే ఆలోచన లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నిరసనలు కొనసాగుతున్న రోజే ప్రధానితో శరద్ పవార్ భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.