PM Modi: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని పేర్కొంటూ.. నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షల సన్నద్ధత, క్రీడలు వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ప్రకటించారు.
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు AI స్కిల్స్‌లో శిక్షణ అందించేలా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా యువతకు కొత్త టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
25
పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ప్రధాని కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేని విద్యార్థులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటి నుంచే శిక్షణ పొందేందుకు ఈ విధానం దోహదపడవచ్చు.
35
చిన్నారుల్లో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం
దేశంలో క్రీడా ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి అవసరమైన అవకాశాలు కల్పిస్తే భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.
టెక్నాలజీ రంగంలో భారత్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సెమీకండక్టర్ తయారీపై కూడా ప్రధాని దృష్టి సారించారు. వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆటోమొబైల్, టెలికాం వంటి అనేక రంగాలకు ప్రయోజనం కలగడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
55
అణుశక్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యం
దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు అణుశక్తి రంగంలో కూడా భారత్ ముందుకు సాగుతుందని ప్రధాని ప్రకటించారు. 2047 నాటికి 100 GW అణుశక్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే వచ్చే 6 నుంచి 7 ఏళ్లలో ఐదు కొత్త అణు రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.